YS Sharmila : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు చనిపోయిన సంగతి తెలిసిందే. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ టీపీ నేత షర్మిల వివాదాస్పద పోలిక తెచ్చారు. రాజు గురించి మాట్లాడుతూ..మధ్యలోకి భగత్ సింగ్ ను తెచ్చారు. దీంతో.. అది కాస్తా పెడార్థానికి దారితీసి వివాదాస్పదమైంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారంటే…
చిన్నారి హత్య తర్వాత ఆమె కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. ఈ ఘటనకు నిరసనగా ఆమె దీక్ష కూడా చేపట్టారు. అనంతరం రాజు ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజు వయసు 30 ఏళ్లు అని చెప్పిన షర్మిల.. భగత్ సింగ్ అంతకన్నా చిన్న వయసులోనే చనిపోయాడని చెప్పారు. రాజు ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? అని ప్రశ్నించారు షర్మిల. ఇవాళ యువత ఒక ఆశయం అంటూ లేకుండా బతుకుతోందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరడం గమనించాల్సిన అంశం.
షర్మిల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. రేపిస్టుతో దేశం కోసం ప్రాణమిచ్చిన భగత్ సింగ్ ను పోల్చడమేంటని నిలదీస్తున్నారు. ఏదిపడితే అది మాట్లాడడమేంటని అడుగుతున్నారు. పైగా.. యువత మొత్తం ఒక ఆశయం లేకుండా బతుకుతోందని చెప్పడం కూడా వివాదానికి కారణమైంది. అంటే.. అందరూ బలాదూర్ గా తిరుగుతున్నారా? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
https://twitter.com/TheRockyBhai/status/1438812442344058882?s=20
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోలేక షర్మిల అవస్థలు పడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రకటన తర్వాత.. షర్మిల పార్టీ గురించిన ఊసే కనిపించట్లేదు. ఆమె చేపడుతున్న మంగళవారం దీక్షలకు ఏ మాత్రం స్పందన ఉండట్లేదని అంటున్నారు. అందుకే.. మొన్న కేటీఆర్ ఎవరు అని వ్యాఖ్యానించడం ద్వారా.. మాటల యుద్ధానికి తెరతీసినప్పటికీ గులాబీ నేతలు ఎవరూ స్పందించలేదు. ఈ నేపథ్యంలో పార్టీని చర్చల్లోకి తెచ్చేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలేవీ పెద్దగా కలిసి రావట్లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల మరింత నష్టం కలుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.