Janasena Yuvashakti Sabha : జనసైనికుల ఉత్సాహం ఉరకలెత్తింది. రణ నినాదం మారుమోగింది. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. అయినా కార్యదీక్ష సడలలేదు. ఇసుమంతైన వెనక్కి తగ్గలేదు. జనసేనాని కోసం, ఆయన ప్రసంగం కోసం ఆత్రుతతో ఎదురుచూశారు. ఆయన మార్గనిర్దేశనం కోసం పరితపించారు. ఒక్కరూ అలసిపోలేదు. సొమ్మసిల్లలేదు. మార్పు కోసం వేయి గుండెల బలంతో నిలబడ్డారు. జనసేనాని ప్రసంగం ఆసాంతం విన్నారు. ఇదో అరుదైన ఘటన. జనసేన సభలో తప్ప మరెక్కడా కానరాని సంఘటన.

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జనసైనికులు తరలి వచ్చారు. ఉదయం పది గంటలకే సభాస్థలికి చేరుకున్నారు. ఎండ, గాలి, వేడిమి, చలిని లెక్క చేయకుండా యువశక్తి కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. తినడానికి సరైన తిండి కూడ దొరకకపోయినా, నీళ్లు అందకపోయినా పట్టుదల వీడని విక్రమార్కుల్లా జనసైనికులు నిలబడ్డారు. ఏ మాత్రం ఉత్సాహాన్ని తగ్గనివ్వలేదు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగం రాత్రి 9:30 వరకూ కొనసాగింది. అప్పటి వరకు ఒక్క జనసైనికుడు కూడ సభాప్రాంగణం నుంచి బయటికి కదలలేదు. జనసేనాని ప్రసంగం ఆసాంతం ఓపికతో విన్నారు. ఒక్కో పవర్ ఫుల్ డైలాగ్ కు ఈలలు, కేరింతలతో మద్దతు తెలిపారు. జనసైనికుల ఓపికకు జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్ధులయ్యారు. ఇదే పట్టుదల, కార్యదీక్షను 2024 ఎన్నికల వరకు కొనసాగించాలని, మార్పు కోసం భాగస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

ఎన్ని రాజకీయ పార్టీల సమావేశాలు నిరంతరం కొనసాగుతుంటాయి. కానీ రణస్థలంలో జరిగిన యువశక్తి కార్యక్రమం అరుదైనదిగా చెప్పుకోవాలి. జనసైనికుల పట్టుదలను యువశక్తి కార్యక్రమం బాహ్యప్రపంచానికి చాటిచెప్పింది. ఏ పార్టీ కార్యకర్తలు ఇంత ఓపికగా నిలబడి ఉండరు. పగటిపూట సమావేశాల నుంచి జనం లేచిపోయిన సంఘటనలు కోకొల్లలు. అలాంటిది రాత్రి పది గంటల వరకు జనసైనికులు సమావేశంలో నిలబడటం వారి కార్యదక్షతకు అద్దంపడుతుంది.