Suryakumar Yadav trophy photo : టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా అటు అభిమానులు.. ఇటు ఆటగాళ్లు మర్చిపోలేకపోతున్నారు. ప్రపంచంలో మరే జట్టుకు సాధ్యం కాని విధంగా టీమిండియా వరుసగా t20 వరల్డ్ కప్ సాధించింది. ఫలితంగా ఈ ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మీద భారీ తేడాతో విజయం సాధించి టీమిండియా కోట్లాదిమంది అభిమానుల ఆకాంక్షలను మరొకసారి నిజం చేసింది.
ఫైనల్ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. వీరి ముగ్గురి దూకుడు.. చివర్లో శివం దుబే వీరోచితమైన బ్యాటింగ్ వెరసి టీమిండియా భారీ స్కోర్ చేయడానికి కారణమయ్యాయి. ఈ టోర్నీలో సూర్య కుమార్ యాదవ్ కొన్ని మ్యాచ్లలో మాత్రమే ఆకట్టుకున్నాడు. కీలకమైన మ్యాచులలో మాత్రం తన స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. అయినప్పటికీ అతని నాయకత్వ సామర్థ్యం మీద మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది.
ఫైనల్ మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. బుమ్రా, అక్షర్ పటేల్ తో పదేపదే దాడి చేయించడంతో న్యూజిలాండ్ జట్టు ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది. కీలకమైన అలెన్ క్యాచ్ శివం దుబే జార విడిచినప్పటికీ.. ఆ ప్రభావం మ్యాచ్ మీద పడకుండా అక్షర్ పటేల్ చేశాడు. మాయాజాలమైన బంతివేసి అలెన్ ను బోల్తా కొట్టించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే భీకరమైన ఎదురు దెబ్బ తగిలింది…
ఇక ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత టీమిండియా ట్రోఫీని సగర్వంగా స్వీకరించింది. సారధిగా ట్రోఫీని స్వీకరించిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ మోములో ఆనందానికి కొదవ లేకుండా పోయింది. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ ట్రోఫీ ని పక్కన పెట్టుకొని బెడ్ రూం లో నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్, అతడి సతీమణి పడుకొని ఉండగా మధ్యలో ఆ ట్రోఫీని పెట్టుకున్నారు. గత సీజన్లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు టీమ్ ఇండియా ప్లేయర్లు ఇలాగే ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాను షేక్ చేశారు.
Déjà vu pic.twitter.com/nqpkW5oK7W
— Surya Kumar Yadav (@surya_14kumar) March 9, 2026