
ఈ దేశంలో ప్రేమికుల హత్యలకు కొదవే లేదు. తమ కులం కాని వారిని ప్రేమించారని, పెళ్లి చేసుకున్నారని ఆగ్రహిస్తున్న పెద్దలు.. ప్రేమికుల ప్రేమతోపాటు వాళ్ల ప్రాణాలను కూడా బలిపెడుతున్నారు. ఇలాంటి దారుణ సంఘటన బీహారో లో చోటు చేసుకుంది. అత్యంత క్రూరంగా వ్యవహరించిన అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడి మర్మాంగాలను కోసి హత్య చేశారు. ఈ దారుణ అకృత్యానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ జిల్లా పరిధిలోని రేపురా రామ్ పుర్షా గ్రామానికి చెందిన సౌరభ్‌రాజ్.. సోర్బారా గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. కానీ.. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి సౌరభ్ ను ఇంటికి పిలిచారు యువతి కుటుంబ సభ్యులు. వారి మాయమాటలకు మోసపోయిన యువకుడు.. వాళ్ల ఇంటికి వెళ్లాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత సౌరభ్ ను దారుణంగా కొట్టారు. అనంతరం కత్తితో అతడి మర్మాంగాలను కోసి చిత్ర హింసలు పెట్టారు. ఆ తర్వాత సమీపంలోని ఓ ఆసుపత్రిలో పడేసి పరారైపోయారు. బాధితుడు విలవిల్లాడుతూ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.
మృతదేహాన్ని నిందితుల ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. నిందితుల ఇంటి ఎదుటనే మృతదేహాన్నికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం నిందితుల ఇంటిపై దాడిచేశారు. సౌరభ్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఇంటిపై దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు.