Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఎన్టీఆర్ ను సక్సెస్ ఫుల్ లీడర్ గా చూపించడంలో ఎల్లో మీడియా పాత్ర అంతా ఇంతా కాదు. మీడియా పాత్ర పరిమితమైన రోజుల్లో ఎన్టీఆర్ రథయాత్రను ఓ లెవల్ లో చూపించగలిగారు రామోజీరావు. తరువాత అదే ఎన్టీఆర్ ను పట్టుకొని తన ఈనాడును విస్తరించారు. రాజగురువు అన్న నామాన్ని సార్థకత చేకూర్చుకున్నారు. అయితే అదే ఎన్టీఆర్ ను పదవీవిచ్యుతుడు చేయడంతో పాటు చంద్రబాబు నాయకత్వానికి తన రాతలతో, చేతలతో బలాన్ని అందించగలిగారు. ఇప్పుడు మూడో తరంలో లోకేష్ ను హైప్ చేయాలని చూస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుతో పోలిస్తే లోకేష్ రాజకీయ పరిణితి అంతంతే. అందుకే లోకేష్ బాధ్యతలను ఎల్లో మీడియా తన భుజస్కందాలపై వేసుకుంది. లోకేష్ పాదయాత్రను జన సమ్మోహన శక్తిగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఏపీ రాజకీయ యవనికపై ఒక నాయకుడిగా చూపేందుకు ఆరాటపడుతోంది.

లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రకు బయలుదేరుతున్నారు. అయితే ఇంతవరకూ పాదయాత్రకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. చిత్తూరు జిల్లా ఎస్పీతో పాటు డివిజన్, మండలస్థాయి పోలీస్ అధికారులకు అనుమతి కోరినా ఇవ్వలేదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర సక్సెస్ అనేది జగన్ సర్కారు చేతిలో ఉందని టీడీపీ బలంగా నమ్ముతోంది. పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా లోకేష్ కు విశేష ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తోంది. లోకేష్ విషయంలో ఏంచేద్దామన్న ఆలోచనతో ఉన్న ఎల్లో మీడియాకు ఇదో అరుదైన అవకాశం వచ్చింది. రచ్చ చేయడం ప్రారంభించింది. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతుందన్న ప్రచారం మొదలుపెట్టారు. తద్వారా ప్రజల నుంచి సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చూడాలని భావిస్తున్నారు.

తెలుగునాట పాదయాత్రల సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయ్యింది. తొలుత 2003లో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి దశాబ్దకాలం పవర్ కు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. 2004, 2009లో అధికారానికి దూరమైన చంద్రబాబు 2013లో పాదయాత్ర చేశారు. టీడీపీని అధికారంలోకి తీసుకురాగలిగారు. 2018లో జగన్ పాదయాత్ర చేశారు. అంతులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అప్పట్లో విపక్ష నేతలుగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వారికి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. స్వేచ్ఛగా పాదయాత్రలు చేసుకునే వెసులబాటు కల్పించాయి. అయితే అప్పట్లో పాదయాత్రలు చేసిన వారు విపక్ష నేతలు. ఆ ముగ్గురితో పోల్చుకుంటే లోకేష్ రాజకీయ పరిణితి తక్కువ. అందుకే పాదయాత్రపై టీడీపీ శ్రేణుల్లో కూడా అనుమానాలున్నాయి. ఇప్పుడు లోకేష్ యాత్రకు జగన్ సర్కారు అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని చెప్పడం ద్వారా బహుళ ప్రాచుర్యం, ప్రజల్లో ఒక ఇంట్రస్ట్ క్రియేట్ చేయడానికి ఎల్లోమీడియా ప్రయత్నాలు మొదలుపెట్టింది.