Ganta Vs Ayyanna: ఏపీలో రాజకీయ సీజన్ ప్రారంభమైంది. ఎన్నికలకు ఇంకా ఏడాదే వ్యవధి ఉండడంతో రాజకీయ పక్షులు పునరాగమనం చేస్తున్నాయి. ఇన్నాళ్లూ గప్ చుప్ గా ఉన్నవారు రాజకీయాలు మొదలుపెట్టేశారు. పార్టీ అధినేతల ప్రాపకం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటువంటి నేతల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒకరు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా.. ఆ పార్టీ తరుపు గంటా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ పవర్ పాలిటిక్స్ కు అలవాటు పడిన గంటా టీడీపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. చివరకు చంద్రబాబు, లోకేష్ లకు కనీసం ముఖం చూపడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు వేరే ఆప్షన్ లేకపోవడంతో టీడీపీలో కొనసాగడానికి డిసైడ్ అయ్యారు. పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇటీవల యువనేత లోకేష్ ను కలిసిన గంటా గంటల తరబడి చర్చించారు. పార్టీకి మైలేజ్ వచ్చే అంశాలతో పాటు పనిలో పనిగా పాదయాత్రకు విలువైన సలహాలు ఇచ్చి వచ్చారు. లోకేష్ పాదయాత్రను ఆకాశమే హద్దుగా పొగుడుతున్నారు. కొవిడ్, ఇతరత్రా కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నానే తప్ప తానెప్పుడూ టీడీపీకి దూరం కాలేదని సంకేతాలిచ్చారు. గంటా వ్యవహారంపై అయ్యన్నకు చిర్రెత్తుకొచ్చింది. ఎవడండీ ఈ గంటా.. ఆయనేమైనా మహా నేత? ప్రధానా? అంటూ ఎడాపెడా వాగించేశారు. గంటాపై తన పాత దాడినే కొనసాగించారు. ఇన్నిరోజులు గప్ చుప్ గా ఉండి ఇప్పుడు బయటకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే టీడీపీ విషయంలో అయ్యన్న నిబద్ధతకు అనుమానించాల్సిన పనిలేదు. పార్టీ కష్టకాలంలో వాయిస్ ను బలంగా వినిపించారు. రాజకీయ ప్రత్యర్థులను తూలనాడడంలో ముందు వరుసలో ఉంటారు. అయితే ఇప్పుడు కేవలం గంటాను మాత్రమే టార్గెట్ చేయడం మాత్రం చర్చనీయాంశమైంది. గంటాలాంటి అవకాశవాద రాజకీయవాదని అక్కున చేర్చుకున్న చంద్రబాబు, లోకేష్ చర్యలను మాత్రం అయ్యన్న ప్రశ్నించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గంటాను ఎలా తీసుకుంటారు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోని నేతను పార్టీలో యాక్టివ్ పార్టిసిపేషన్ కల్పించడం ఏమిటి? దగ్గరికి ఎందుకు తీసుకుంటున్నారు అని తండ్రీ కొడుకులను ప్రశ్నించకపోవడాన్ని తప్పుపడుతున్నారు.

కేవలం గంటాపై విమర్శలు ఎక్కుపెట్టినంత మాత్రాన అయ్యన్నకు కానీ.. టీడీపీకి కానీ ఒరిగిందేమీ లేదు. అవకాశ వాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, ఆయన కుమారుడ్ని ప్రశ్నిస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయ్యన్నలాంటి వారు ప్రశ్నిస్తే భవిష్యత్ లో ఇటువంటి అవకాశవాద రాజకీయాలు చేసేవారికి చెక్ పడుతోంది. అటువంటి నాయకులను తీసుకోవడానికి అధినేతలు భయపడతారు. ఎన్నికలు సమీపించేసరికి గంటా చేరువవుతున్నారనే దాని కంటే.. గత్యంతరం లేక టీడీపీయే దగ్గర చేసుకుంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అయ్యన్న తన ప్రస్టేషన్ ను గంటాపై చూపినంత మాత్రాన పార్టీకి ఒరిగిందేమీ లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.