Andhra Pradesh Heat Wave 2026: ఏపీలో( Andhra Pradesh) ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రమాదం తప్పదని సంకేతాలు వస్తున్నాయి. అయితే జూన్లో సైతం వడగాలులు భారీగా విస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ లెక్కన ఆగస్టు వరకు వేడి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపడం ప్రారంభించాడు. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. అయితే నడి వేసవిలో ప్రమాదం తప్పదు అన్న హెచ్చరికలు ముందు నుంచే వచ్చాయి. ప్రస్తుత పరిస్థితి అలానే ఉంది. గతంతో పోల్చితే వేసవిలో వర్షాలు లేవని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
* దేశవ్యాప్తంగా అదే పరిస్థితి..
ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. భారత వాతావరణ కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది. రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా చెబుతోంది. అత్యవసరం అనుకుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య బయటకు వెళ్ళవద్దని సూచిస్తోంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని.. డిహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవపదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు.
* జూన్లో సైతం..
సాధారణంగా మార్చి నుంచి మే వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. జూన్లో వర్షాలు ప్రారంభమై ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. జూన్ నెలలోనే ఏకంగా పగటిపూట ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదవుతాయని.. వడగాలులు తీవ్రస్థాయిలో ఉంటాయని హెచ్చరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా జూన్లో ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరికలు రావడంతో ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
* ఎల్ నినో పై అంచనాలు
అయితే ఈ ఏడాది నడి వేసవిలో ఎల్ నినో ఏర్పడుతుందని.. ఆగస్టు నాటికి బలపడుతుందని అంతర్జాతీయ సంస్థ యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్ట్ అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్ నీనో ఏర్పడడానికి 80%, మోస్తరు ఎల్ నినో ఏర్పడేందుకు 98% అవకాశాలు ఉన్నట్లు ఒక అంచనాకు వచ్చింది. మార్చి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఏప్రిల్ తో పాటు మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతాయని.. ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తోంది.
* ప్రధానంగా మార్చిలో శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, మార్కాపురం, నంద్యాల, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్సార్ కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* గుంటూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచే అవకాశం ఉంది.