YCP Sajjala Ramakrishna Reddy: వైసీపీలో ప్రస్తుతం సజ్జల వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన పెత్తనంపై పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో పలువురు సీనియర్ నేతలు మండిపడుతున్నారు. ఆయనకిస్తున్న ప్రాధాన్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డి నెంబర్ టూ గా వ్యవహరించినా ప్రస్తుతం ఆయన దూరం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానాన్ని సజ్జల భర్తీ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

మొదట్లో ప్రభుత్వ సలహాదారుగా పార్టీ వ్యవహారాలకే పరిమితమైనా తరువాత తన పరిధి విస్తరించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో విభేదాల నేపథ్యంలో తన శక్తియుక్తుల్ని కలిపి పార్టీలో నెంబర్ టూ అనిపించేలా పనులు చక్కబెట్టారు. దీంతో పార్టీలోపట్టు పెంచుకుంటూ కీలక నేతగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల చర్యలపై పలువురు సీనియర్లు తమలోని అక్కసు వెళ్లగక్కుతున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ ను కలవాలన్నా సజ్జల(YCP Sajjala Ramakrishna Reddy) పర్మిషన్ తప్పనిసరి. దీంతో పార్టీలో సజ్జల నెంబర్ టూ అనే చర్చ దినదినం పెరిగిపోతోంది. ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన ఆయన ప్రభుత్వంలో అన్నింట్లో వేలు పెట్టే వరకు వెళ్లడం అందరిలో ఆగ్రహం తెప్పిస్తుంది. పార్టీలో పదవులు దక్కాలన్నా సజ్జల ప్రాపకం పొందాకే అని తెలుస్తోంది. ఇప్పటికే సజ్జలపై పలువురు విమర్శలు చేస్తున్నా అధినేత జగన్ మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
సజ్జల తీరుపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విమర్శలు చేస్తున్నా మరో వైపు డీఎల్ రవీంద్రారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ మంత్రి కూడా ప్రెస్ మీట్లు పెట్టకుండా సజ్జలనే సర్వస్వంగా చేయడంపై తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సజ్జల వైఖరిపై పార్టీలో చాలా మందిలో ఆగ్రహం పెరుగుతోందని తెలుస్తోంది. అయినా జగన్ మాత్రం సజ్జలను కంట్రోల్ చేయకపోవడంపై పార్టీ నేతల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.