AP Stamp Paper: జగన్ సర్కార్ చేస్తున్న దానికి.. చెప్పేదానికి పొంతన ఉండదు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యాన్ని నియంత్రించేందుకు వెనువెంటనే కలర్ జిరాక్స్ లను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకుగాను కార్డు ప్రైమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ తో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ఎప్పుడైనా కావాలంటే ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే స్పెసిమన్ కాపీలు అందించను న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీని వెనుక మరో కథ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చాలామంది పొదుపు చేసుకుని ఇళ్ల స్థలమో, వ్యవసాయ భూమో కొనుగోలు చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చుకుని భద్రంగా బీరువాలో దాచి పెట్టుకుంటారు. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయంతో అటువంటి పత్రాలు ఏవీ జారీ కావు. ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం మన దగ్గరే ఉంచేసుకుని జిరాక్సులను మాత్రమే చేతికి ఇస్తుంది. ఒకవేళ సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే ఫీజు కట్టి… చేతికి అందే దాకా ఎదురు చూడాల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజల ఒరిజినల్ పత్రాలు ఉండడం ఎంతవరకు సేఫ్? అవకతవకలు జరిగితే ఎవరు జవాబుదారీ అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది భూ క్రయవిక్రయాల్లో కీలకం. ఫిజికల్ డాక్యుమెంట్లు ఏవైనా తప్పులు దొర్లితే ఒక్క అక్షరమైనా దాన్ని సరిదిద్దాలంటే మళ్లీ క్రయవిక్రయదారులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దస్తావేజు సిద్ధం అయ్యాక ఒకటికి రెండుసార్లు సబ్ రిజిస్టార్లు, కిందిస్థాయి అధికారులు సరిచూసి సంతకాలు చేస్తారు. అయితే ఈ కొత్త విధానంతో ఫిజికల్ డాక్యుమెంట్ చేతిలో లేకపోతే వాటిని సరిచూడడం సాధ్యమయ్యే పని కాదని అధికార వర్గాలే చెబుతున్నాయి. ఒకవేళ ఈ డాక్యుమెంట్లో తప్పులు దొర్లితే ఎవరు చూడాలి, వాటిని మార్చాలంటే ఎలా మార్చాలి? అన్న వాటికి సమాధానం లేదు. దశాబ్దాలుగా వస్తున్న విధానాలను మార్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. అమలు చేయడం సాధ్యమా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. జిరాక్స్ కాపీలు ఇవ్వడం ద్వారా అవకతవకలకు మనమే చోటు కల్పించినట్టు అవుతుంది. అయితే ఈ విషయం జగన్ సర్కార్కు తెలియదు కాదు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ కొత్త విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త విధానం తేవడంపై ఒక ప్రచారం అయితే జరుగుతోంది. స్టాంప్ పేపర్ల తయారు చేసే కంపెనీకి జగన్ సర్కార్ 8 వేల కోట్ల రూపాయలు బాకీ పడినట్లు తెలుస్తోంది. దీంతో సదరు కంపెనీ స్టాంప్ పేపర్ల సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో అప్పటికప్పుడు జిరాక్స్ కాపీల విధానాన్ని ఆచరణలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదేదో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త సంస్కరణ అన్నట్టు, లోకకళ్యాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ సోషల్ మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది. కానీ తెర వెనుక స్టాంప్ పేపర్ల కంపెనీ బకాయి ఉందన్న విషయాన్ని కత్తిపుచ్చుకునేందుకే ఈ నిర్ణయం అని తెలియడం విస్మయ పరుస్తోంది. ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం.. తన స్వార్థం కోసం ఈ విధానం ప్రవేశపెట్టడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.