https://oktelugu.com/

chess champion Koneru : వరల్డ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపీపై ప్రశంసల జల్లు.. కారణం ఇదే

తెలుగు చెస్ ప్లేయర్, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పుడు చెస్ లో చరిత్ర సృష్టించిందనే చెప్పాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 30, 2024 / 09:09 AM IST

    chess champion Koneru

    Follow us on

    chess champion Koneru : తెలుగు చెస్ ప్లేయర్, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పుడు చెస్ లో చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఈ కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా అవతరించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ఈ టోర్నీలో హంపి 8.5 పాయింట్లు సాధించి ఏకంగా అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా విజేతగా గెలిచి అందరి మనసు దోచింది. న్యూయార్క్‌లోని వాల్‌ స్ట్రీట్‌లో జరిగిన 11వ రౌండ్‌లో హంపి ఐరీన్ సుకందర్‌ను ఓడించి తనకంటూ చరిత్రలో ఓ ప్రత్యేక పేజీని రాసుకుంది. . తన ప్రదర్శనతో వరల్డ్‌ చెస్‌లో మంచి పేరును సంపాదించింది.

    అయితే కోనేరు హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలవడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఈమె ఛాంపియన్ గా నిలిచింది. అంటే ఇది రెండో సారి. ఐదేళ్ల క్రితం అంటే 2019లో హంపి తొలిసారి వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిళ్లను నెగ్గిన రెండో ప్లేయర్‌గా కూడా ఈమె ఘనత సాధించింది. ఈ జాబితాలో చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలివడం గమనార్హం. ఇక నిన్న జరిగిన ఇదే ఈవెంట్‌లో మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో ఉండి తను కూడా మంచి ప్లేయర్ గా నిలిచింది.

    ఇక వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పురుషుల విభాగం విజేతగా రష్యాకు చెందిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ వోలోదర్ ముర్జిన్‌ టైటిల్ విన్ అయ్యారు. ముర్జిన్‌ 13 రౌండ్లలో 10 పాయింట్లు సాధించారు. ఇదే టోర్నీలో పాల్గొన్న భారత గ్రాండ్‌మాస్టర్‌, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశి ఐదో స్థానంలో నిలిచారు. వాస్తవానికి తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే వరకు అర్జున్ అగ్రస్థానంలోనే ఉన్నా చివరి రౌండ్లలో అనూహ్యంగా వెనకంజలో ఉన్నాడు.

    ఇదిలా ఉంటే ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన హంపిని ప్రముఖులు అభినందించారు. ఇప్పుడు కోట్ల మంది భారతీయులకు హంపి స్పూర్తిగా నిలుస్తోంది. ఇదే విషయాన్ని తెలుపుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఛాంపియన్ షిప్‌ను రెండుసార్లు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా హంపి నిలవడం గర్వకారణం అంటూ కొనియాడారు ప్రధాని.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హంపిని ప్రశంసించారు. ఆమె విజయం దేశానికే గర్వ కారణం అన్నారు. 2024 మన దేశ చెస్‌ క్రీడాకారులకు మరిచిపోలేని సంవత్సరమని పేర్కొన్నారు సీఎం. మరోవైపు మహీంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఈమె మీద ప్రశంసలు కురిపించారు.