ఏపీలో పంచాయతీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. మరో విడత పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. మొదటి నుంచి వైసీపీ సర్కార్ ఎన్నికలను వద్దంటూనే వస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా యుద్ధ వాతావరణం కనిపించింది. ఎట్టకేలకు ఎస్‌ఈసీ మాటనే నెగ్గింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. మరోవైప మొదటి విడత నుంచే వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
Also Read: హత్య కేసు నిందితులు వారే..?: మిస్టరీ ఛేదించిన పోలీసులు
ఎన్నికలను వద్దన్నా నిర్వహిస్తుండడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవడమో.. లేదా.. తమవైపు తిప్పుకోవడమో.. లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్‌గా ఉన్న పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులే తీసుకున్నారు. అయితే త్వరలో ప్రక్షాళన జరగనున్న నేపథ్యంలో మంత్రులు తమ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పలేదు. దీంతో ఈ లోకల్ వార్‌లో స్థానిక నాయకులు పోటీ పడుతున్నా పరోక్షంగా మంత్రులే తెరవెనక ఉండి కథ నడిపిస్తున్నారు.
ఇప్పటికే మంత్రులు క్షేత్రస్థాయిలో తమకు ఉన్న పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. కొందరికి బాగానే ఉన్నా.. మరికొందరి పరిస్థితి మాత్రం దారుణంగా తయారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా మంత్రుల పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉందట. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ గట్టి పట్టుంది. దీంతో అక్కడి మంత్రి తానేటి వనిత పరిస్థితి నాలుగు అడుగులు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నవిధంగా ఉంది. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ నుంచి గెలిచినా.. ఆ రేంజ్‌లో మాత్రం ఇక్కడ దూకుడు ప్రదర్శించడం లేదు.
Also Read: శత్రువుకు శత్రువు మిత్రుడు.. ఆ పత్రికాధినేత పరోక్షంగా వైఎస్ షర్మిలకు సహకరించారా?
గ్రామీణ ప్రాంతాల్లోనూ పథకాలు అమలవుతున్నా అభివృద్ధి కొరవడింది. దీంతో మంత్రి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. పైగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి జవహర్ ఇక్కడ పరోక్షంగా చక్రం తిప్పుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1999లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడగా.. గత ఎన్నికల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. వైఎస్ ప్రభంజనంలోనూ 2004, 2009 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ గెలిచింది. పైగా తానేటి వనిత నాన్‌లోకల్ కావడంతో పాటు నియోజకవర్గ వైసీపీలో ఉన్న గ్రూపులు ఆమెకు తలనొప్పిగా మారాయి. ఇక టీడీపీకి సరైన నాయకుడు లేకపోయినా శ్రేణులు మాత్రం కసితో స్థానిక ఎన్నికలకు పని చేస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ వైసీపీ స్పీడ్‌కు పూర్తిగా బ్రేకులు వేస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన మరో మహిళా మంత్రి సుచరిత పరిస్థితి కూడా ఇలానే ఉంది. నియోజకవర్గంలో ఉండకపోవడం, అడపాదడపా మాత్రమే వచ్చిపోతుండడం.. ముఖ్యంగా ప్రత్తిపాడు పరిధిలోని గ్రామ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టకపోవడం వంటివి ఆమెకు నెగెటివ్‌గా పరిణమించాయని అంటున్నారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కురుపాం నియోజకవర్గంలో ఆమె అడ్రస్ కూడా కొన్నాళ్లుగా కనిపించడం లేదు. అయితే అక్కడ టీడీపీని నడిపించే నాథుడు లేకపోవడమే వైసీపీకి ప్లస్ అయినట్లుగా పలువురు అంటున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్