Anam Ramanarayana Reddy- Kotam Reddy: ఆయనను హిట్లర్ను మించిన నియంత అంటారు. ముస్సోలినీని మరిపించే నియంతృత్వం ఆయనదంటారు. ప్రజాస్వామ్యయుగంలోని నియంతృత్వానికి నిలువెత్తు నిదర్శనమని ప్రత్యర్థులు నిందిస్తారు. ఆయన చెప్పిందే వేదం కావాలంటారట. ఆయన మాటే శాసనం కావాలంటారట. చట్టసభలు, శాసనసభలు అలంకారప్రాయమని నమ్ముతారట. ఇప్పుడు సొంతపార్టీ వారే ఆయన వైఖరి పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన మాట కాదంటే పగబడతారని ఆరోపిస్తున్నారు. ఇంతకీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఆ నయా నియంత ఎవరో తెలుసుకోండి.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నయా నియంతగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. ఇందుకు పలు సంఘటనలను ఉదహరిస్తున్నాయి. తెలుగుదేశంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం, ప్రతిపక్షంలో అమరావతికి జై కొట్టి.. ఆ తర్వాత మాట తప్పడం, తిరుగుబాటు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు పై వేధింపులు మొదలుపెట్టడం వంటి అంశాలను ఉదాహరణగా చూపిస్తున్నాయి. ప్రధానంగా ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో జగన్ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నాయి. ఒక నియంత మనస్తత్వం ఉంటేనే ఓ ఎంపీని ఇలా వేధిస్తారని విమర్శిస్తున్నాయి. విబేధించడం ప్రజాస్వామ్యంలో ఓ హక్కు. తన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం ఓ ప్రజాప్రతినిధి విధి. ఇదే రఘురామకృష్ణరాజు చేశారు. కానీ జగన్ దీనిని వ్యక్తిగతంగా తీసుకున్నారు. రఘురామ పై వేధింపులతో సాధించారు.
ప్రభుత్వ వేధింపులతో రఘురామ వెనక్కి తగ్గకపోయినప్పటికీ.. సొంత నియోజకవర్గానికి మాత్రం రాలేకపోయారు. ప్రభుత్వం రానివ్వలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటిదే మరొక అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తనను చంపడానికి కుట్ర చేశారని ఆనం ఆరోపించారు. తనను ఎన్ కౌంటర్ చేసినా సిద్దంగా ఉన్నానని కోటంరెడ్డి చెబుతున్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యల వెనుక ఏదో అంతరార్థం ఉన్నట్టు తెలుస్తోంది.
జగన్ ను వ్యతిరేకించి తాము బయటికి వచ్చిన నేపథ్యంలో తమ పై కక్ష సాధింపు చర్యలు ఉంటాయని ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ పరోక్షంగా చెబుతున్నారు. ఈ ఇద్దరికీ జగన్ నైజం తెలుసు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ అనుకూలవర్గం ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొడుతోంది. జగన్ నిజంగా నియంతే అయితే.. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇలా చేసి ఉండేవారా అని ఎదురు ప్రశ్నవేస్తున్నారు. కేవలం జగన్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ.. జగన్ వ్యక్తిత్వం పై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు డబ్బు, పదవి ఆశచూపి వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారని విమర్శిస్తున్నారు. పార్టీని ఓ పద్దతిలో నడిపే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారని, అంతమాత్రాన నియంతే అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అధికారంలో వచ్చిన నాటినుంచి జగన్ వ్యవహారశైలి చూసిన వారెవ్వరూ ఆయనలో ప్రజాస్వామ్య భావనలు ఉన్నాయని అనుకోరు. అందుకు ఇటీవల సంఘటనలే ఉదాహరణ. ప్రతిపక్షాలు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రజాస్వామిక హక్కు. ఆ హక్కును కాలరాయాలనుకోవడం నియంతృత్వం కాదా ?. జీవో నెంబర్ 1ని తీసుకురావడం ఏం ప్రజాస్వామ్యం ?. వారాహి వాహనాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఒక వాహనాన్ని చూసి భయపడటం, ఆ భయంతో విపరీత నిర్ణయాలు తీసుకోవడం నియంత మనస్తత్వం కాదా ? ప‌్రభుత్వ పాలన సరిగా ఉంటే ప్రజలే తిరిగి ఎన్నకుంటారు. ప్రతిపక్షాలు ఎంత ప్రచారం చేసినా నమ్మరు. కానీ ఎప్పుడైతే తనపై తనకు నమ్మకం పోతుందో అప్పుడే ఇలాంటి నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటారు.