
మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది. అయితే.. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చబోతున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్, టీఆర్ఎస్ , బీజేపీలకు ఈ ఎన్నిక లిట్మస్ టెస్ట్‌గా మారింది. గెలుపు అవకాశాలు ఉన్నాయని ఓ వైపు గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తేనే మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పోటీ పడగలిగే స్థితిలో ఉంటుందనేది అందరూ అంగీకరించే నిజం. అందుకే మిగతా పార్టీల కన్నా నాగార్జున సాగర్.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అత్యంత కీలకం. కానీ.. ఇప్పుడు సాగర్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కూడా కీలకమే. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందన్న ప్రచారం పూర్తిగా తగ్గాలంటే సాగర్‌లో గెలిచి తీరాలి. అందుకే ఆరు నూరైనా సాగర్ టీఆర్ఎస్ ఖాతాలో పడాల్సిందేనని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసి పంపించారు. సిట్టింగ్ సీటు అయినా గెలిస్తే టీఆర్ఎస్‌కు వచ్చే మైలేజీ వేరుగా ఉంటుంది. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న అధికార వ్యతిరేకత అనేది మటుమాయం అవుతుంది. మళ్లీ టీఆర్ఎస్‌కు గత వైభవం వస్తుంది. దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాల ప్రభావం పూర్తిగా కనుమరుగు అవుతుంది. అందుకే.. నాగార్డున సాగర్ ను టీఆర్ఎస్ ఎప్పుడూ లేనంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇక ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. సాగర్ సీటును కూడా గెలుచుకోవాలని చూస్తోంది. ఈ ఎన్నిక బీజేపీకి కూడా చావోరేవో అన్నట్లుగా మారింది. దుబ్బాక తర్వాత గ్రేటర్‌లోనూ మంచి ఫలితాలు సాధించి.. ఇక సీఎం సీటే మిగిలిందన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. దానికి తగ్గట్లుగా సాగర్‌లో ఇప్పుడు ప్రభావం చూపించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటివరకూ ఎలుగెత్తి చాటిన బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో వచ్చిన హైప్ అంతా.. ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోవడం నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడో నాలుగో స్థానంలో ఉండిపోవడంతో చల్లబడిపోయినట్లయింది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక ద్వారా మళ్లీ బీజేపీ తనను తాను మరోసారి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంది.
మొత్తంగా అన్ని పార్టీలకూ ఈ ఎన్నికల ప్రతిష్టాత్మకమే కానున్నాయి. అందుకే.. ఈ సీటును ఎలాగైన తమ ఖాతాలో వేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ కత్తులు నూరుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పంథాను కొనసాగిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మరి ఈ ఉప ఎన్నిక పోరులో చివరికి ఏ పార్టీ సక్సెస్ అవుతుందో చూడాలి.