KCR: రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు సంపాదించుకున్న కేసీఆర్.. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత బీజేపీ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయాలు ఫుల్ హీటెక్కాయి. నువ్వా నేనా అన్నట్టు బీజేపీ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు కేసీఆర్. మరో పక్క కాషాయ నేతలు కూడా మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు హుజురాబాద్ విజయంతో దూసుకుపోతున్నారు. ఈ గెలుపు తాలూకూ ఊపును 2023 ఎలక్షన్స్ వరకు కొనగించాలని, ఇదే సరైన సమయం అని భావించి కేసీఆర్‌పై ఎదురు దాడి చేస్తూ ముందుకు సాగుతోంది రాష్ట్ర కాషాయ దళం.

రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని భావించిన కేసీఆర్.. రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నారు. హుజురాబాద్ ఓటమి నుంచి ప్రజల ధ్యాసను మళ్లించడానికా ? లేదా కాషాయ దళం పై ఫ్రస్టేషన్ కారణమో తెలియదు గానీ.. అనూహ్యం ధాన్యం కొనుగోలు విషయాన్ని ముందుకు తెచ్చారు. ఈ కొట్లాటలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ కాస్త వెనుకపడిందనే చెప్పాలి. దీనంతటికీ కారణం బీజేపీ తరఫున పోటీ చేసిన ఈటల గెలుపు అని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు పై రచ్చ నడుస్తోంది. కమళం, గులాబీ దండులు మాటలు దాటి భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి. ఈ ధోరణి కింది స్థాయి కార్యకర్తలకు కూడా పాకింది. దినికి నిదర్శనం నల్గొండ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన బండి సంజయ్ పై దాడి జరగడమే. కేసీఆర్ ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు కమలం పార్టీ నేతలు. మరోపక్క వడ్లు కొంటారో కొనరో అన్న విషయం పై కేంద్రంతో చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఇందిరాపార్కు దగ్గర ఉన్న ధర్నాచౌకులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి మహా ధర్నాలో పాల్గొంటున్నారు కేసీఆర్.
అవసరం అయితే ఢిల్లీలో కూడా ధర్నాలు చేసేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక గళం ఎత్తుతున్నారు. అయితే, గతంలో వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ తురవాత ఏం జరిగిందో తెలియదు గానీ వ్యవసాయ చట్టాల విషయంలో, కేంద్ర ప్రభుత్వ విధానాలపై మిన్నకుండిపోయింది. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అనూకూలంగా వ్యవహరించడం చేశారు కేసీఆర్. ఇప్పుడు హుజురాబాద్ ఓటమితో కేసీఆర్‌లో మళ్లీ మార్పు వచ్చి.. కేంద్రంతో కోట్లాట పెట్టుకునేందుకు సిద్దమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
Also Read: KCR Dharna Chouwk: ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు ఇప్పుడు అదే దిక్కైంది?
ఈ దూకుడును కేసీఆర్ కొనసాగిస్తారా..? లేక గతంలో మాట మార్చిన విధంగానే యథావిధిగా కొన్ని రోజులు ఊకదంపుడు వ్యాఖ్యలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేసి ఉరుకుంటారా ..? అన్న ప్రశ్నలు లేవనెత్తున్నాయి. అలాగే, కేంద్ర విధానాలపై ఎంత కాలం గులాబీ బాస్ పోరాడుతారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలయింది. మరి కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తాడు.. భవిష్యత్తు కార్యచరణ ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: BC calculation: బీసీ గణనకు కేంద్రం అంగీకరిస్తుందా?