
BJP – TDP : తెలుగునాట పొత్తుల అంశం కొలిక్కి రావడం లేదు. ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో స్పష్టత రావడం లేదు. కొన్ని పార్టీలకు కలవాలని ఉన్నా.. మరికొన్నిపార్టీలు కలవలేమంటూ తేల్చేస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా అన్న రీతిలో కలిసి నడవాలనుకుంటున్న పార్టీలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. తొలుత నవంబరులో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ముడిపడే పొత్తుల బట్టి ఏపీలో పొత్తులు చిగురించే అవకాశముంది. అయితే అక్కడా..ఇక్కడా ఎక్కువగా పొత్తుల గురించి ఆలోచిస్తోంది మాత్రం చంద్రబాబే. తెలంగాణలో బీజేపీకి సాయమందించి.. ఏపీలో సాయం తీసుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కానీ అంత సానుకూలతలు కనిపించడం లేదు.
టీడీపీ యాక్టివ్ వెనుక…
ఇటీవల చంద్రబాబు తెలంగాణలో పార్టీని యాక్టవ్ చేశారు. అయితే ఇదంతా బీజేపీ ప్రాపకం కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసి బీజేపీని ఆకర్షించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందులో భాగంగానే పార్టీకి దూరమైన బీసీ నేత కాసానిని పార్టీలోకి రప్పించి సారధ్య బాధ్యతలు అప్పగించారు. దూరమైన టీడీపీ నాయకులను, కేడర్ ను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే టీడీపీ కేడర్ చేజారిపోయింది. టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లో కి టర్న్ అయ్యింది. ఈ క్రమంలో ఎన్నిరకాలుగా ప్రయత్నించినా వర్కవుట్ కాదన్న టాక్ వినిపిస్తోంది.
బీజేపీ కోసమే ఆ ప్రయత్నం..
ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ గట్టి ఫైట్ చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని నీర్వీర్యం చేసి మరీ కలబడుతోంది. కానీ బీజేపీకి క్షేత్రస్థాయిలో పట్టుదొరకడం లేదు. వచ్చే ఎన్నికలకు ఆ పార్టీకి ఉన్న బలం చాలదు. అందుకే తెలంగాణలో మిగిలి ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. అయితే అక్కడ వామపక్షాలు, మజ్లిస్ బీజేపీ వైపు వచ్చే చాన్సే లేదు. షర్మిళ వైఎస్సార్ టీపీ, ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ, టీడీపీ మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణతో ముడిపెట్టి ఏపీలో బలపడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో చెక్కుచెదురైన టీడీపీ కేడర్ ను ఒకదగ్గర చేర్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అందుకే చంద్రబాబు విషయంలో బీజేపీ అచీతూచీ వ్యవహరిస్తోంది.
కర్నాటక ఎన్నికల తరువాత క్లారిటీ..
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, టీడీపీ కలిసి పనిచేసే అవకాశాలు అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. అయితే కర్నాటకలో మాత్రం బీజేపీకి చుక్కెదురైతే మాత్రం బీజేపీ శరవేగంగా నిర్ణయాలు తీసుకునే చాన్స్ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. టీడీపీతో కలిసి వెళ్లేందుకు ప్రతిపాదన పెట్టారన్న వార్తలు వస్తున్నాయి. కర్నాటక ఎన్నికల తరువాతే నిర్ణయాలుంటాయని పవన్ కు పెద్దలు చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. అందుకే కర్నాటక ఎన్నికల తరువాత ముందుగా తెలంగాణలో పొత్తులపై క్లారిటీ వస్తుంది. అక్కడ వర్కవుట్ అయితే మాత్రం చంద్రబాబు ఏపీ విషయంలో కూడా పావులు కదిపే చాన్స్ కనిపిస్తోంది. సో బీజేపీ, టీడీపీ కలిసి నడవడంపై కొద్దిరోజుల్లో క్లారిటీ రానుందన్న మాట.