
YCP Vs Chandrababu Naidu : వైసీపీలో ఉండే కాకలుతీరే నాయకులు సైతం హైకమాండ్ సూచనలు స్పష్టంగా పాటించాల్సిందే. వారి చెప్పిన విధంగానే ప్రెస్ మీట్ లో మాట్లాడాలి. అందులో తమ సొంత అభిప్రాయానికి తావులేదు. పలానా అంశం మీద మాట్లాడాలి అంటే.. దానిపైనే స్పందించాలి. అది కూడా అధినేత జగన్ కు పొగడ్త.. అంతకు మించి చంద్రబాబుపై విమర్శ ఉండాలి. లేకుంటే మరోసారి ప్రెస్ తో మాట్లాడేందుకు అవకాశమివ్వరు. అందుకే వైసీపీలో ఆఫీషియల్ స్పోక్స్ మెన్స్ తరచూ మారుతుంటారు. ప్రస్తుతం మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ స్టిక్కర్ అతికిస్తున్నారు. అయితే దీనికి పాజిటివ్ టాక్ రావడం లేదు. అంతకు మించి వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ హైకమాండ్ లో అంతర్మథనం ప్రారంభమైంది.
మంత్రులకు ఆదేశాలు..
ఇటువంటి తరుణంలో మొత్తం కేబినెట్ నే హైకమాండ్ పెద్దలు అలెర్ట్ చేశారు. రాజధానిలో ముగ్గురు, మిగతా వారు ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లడాలని మంత్రులకు పురమాయించారు. పనిలో పనిగా జగన్ కు విపరీతమైన జనాదరణ ఉందని.. చంద్రబాబుపై తిట్ల దండకం పూనుకోవాలని ఆదేశాలిచ్చారుట. దీంతో అదే పనిగా కొందరు మంత్రులు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టిక్కర్ కార్యక్రమానికి ఆదరణ పెంచబోయి.. చంద్రబాబును తిట్టి ఆయన్ను హైప్ చేశారు. ఇప్పుడిదే వైరల్ అవుతోంది. స్టిక్కర్ కార్యక్రమాన్ని చేజేతులా మంత్రులే ఫెయిల్ చేసుకున్నట్టయ్యింది.
కొత్తగా పోటీ చేయాలని సవాల్..
వైసీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు. తను దూరడానికి సందు లేదు. కానీ మెడకు ఒక డోలు అన్నట్టు.. తాము గెలుపు అంత సులువు కాదని ప్రత్యర్థులకు సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని కాళ్లు దువ్వుతున్నారు. ఏకంగా చంద్రబాబుకే సవాల్ చేసేస్తున్నారు. వైసీపీలో ప్రతిఒక్కరికీ ఇది ఫ్యాషన్ గా మారిపోయింది. ముఖ్యంగా కొడాలి నాని వంటి వారి నోట ప్రతిసారి ఇదే సవాల్ వస్తోంది. చివరికి రోజా కూడా..కుప్పం అయినా సరే.. నగరి అయినా సరే రమ్మని రోజా సవాల్ చేశారు. రోజాకు నగరిలో టిక్కెట్ ఇస్తారో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైసీపీ నేతల్లో ఎక్కడ చూసినా సవాళ్ల పర్వమే నడుస్తోంది. చివరకు టిక్కెట్లు అనుమానం ఉన్నవారు సైతం సవాల్ చేసి హైకమాండ్ ప్రాపకం కోసం పాట్లు పడుతున్నారు.
చావు కోసం కామెంట్స్..
ఈ క్రమంలో రాజకీయాలు పూర్తిగా దిగజార్చేస్తున్నారు. సైద్ధాంతిక విభేదాలు కాస్తా వ్యక్తిగత విభేదాలుగా మారాయి. తమిళనాడు తరహాలో పగ, ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల చావు కోరే దాకా పరిస్థితులు వెళుతున్నాయి. కొందరు వైసీపీ నేతలు చంద్రబాబు చావు గురించి మాట్లాడేస్తున్నారు. ప్రస్టేషనో లేకుండా ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయమో కానీ.. చంద్రబాబును వినని, వినకూడని మాటలు అనేస్తున్నారు. టిక్కెట్ ఇస్తే టీడీపీలో చేరుతానని వెళ్లిన ప్రసన్నకుమార్ రెడ్డి.. అలా ఇవ్వలేమని చెబితే.. మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ఆయన కూడా చంద్రబాబు చావు భయంకరంగా ఉంటుందని ప్రకటనలు చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ నేతలకు చంద్రబాబు నామస్మరణ చేయనిదే నిద్రపట్టడం లేదు.