Homeఆంధ్రప్రదేశ్‌Vizag Steel - KCR : వైజాగ్ స్టీల్ పై మీడియాను కెసిఆర్ అంతలా భయపెట్టాడా?

Vizag Steel – KCR : వైజాగ్ స్టీల్ పై మీడియాను కెసిఆర్ అంతలా భయపెట్టాడా?

Vizag Steel – KCR : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తుంటే కెసిఆర్ అడ్డుకున్నాడు. సింగరేణిని అడ్డంపెట్టి కాపాడాడు. ఇదీ ఆ సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్య. సరే ఆయన కంటే తెలియదు అనుకుందాం. పరిజ్ఞానం అంతంత మాత్రమే అనుకుందాం. మరి మీడియాకు ఏం పుట్టింది? ప్రధాన స్రవంతిలో ఉండే పాత్రికేయులకు ఏమైంది? అందరూ కెసిఆర్ కు సాగిలపడినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి విశాఖ ఉక్కు ప్లాంట్ కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు కేంద్రం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ప్రభుత్వం గాని, ప్రభుత్వ రంగ సంస్థలు గాని పాల్గొనే అవకాశం లేదు. అయితే ఉక్కు, ఉక్కు సంబంధిత ముడి పదార్థాల నిర్వహణలో అనుభవం ఉన్న వారికే బిడ్ లో పాల్గొనే అవకాశం ఉంది. కానీ దీన్ని సాకుగా చూసిన కేసీఆర్ రంగంలోకి దిగారు. సింగరేణి అధికారులను విశాఖపట్నం పంపించారు. దీంతో ఆయన అనుకూల మీడియా ప్రచారానికి దిగింది. సమయంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విశాఖపట్నంలో పర్యటించడం ప్రైవేటీకరణ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… కెసిఆర్ వల్లే ఇదంతా జరిగిందని ఆయన సొంత మీడియా డప్పు కొట్టింది. మిగతా మీడియా కూడా అదేదారిలో పయనించింది.

వాస్తవానికి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికిప్పుడు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందులో భాగంగానే ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. తదుపరి ప్రక్రియ చేపడతామని చెప్పింది. దీనిని విస్మరించి తన పొలిటికల్ ఎజెండా ప్రకారం ఒక రాజకీయ ప్రచారాన్ని కెసిఆర్ అండ్ కో తెరపైకి తీసుకొచ్చింది.. దీనికి మీడియా వంత పాడింది. వాస్తవానికి వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా కెసిఆర్ కాంపౌండ్ లో ఉండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రజలకు నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు.. కానీ ఇలా అబద్దాలను వ్యాప్తి చేయడం వ్యవస్థకు అసలైన ప్రమాదం.

తెలంగాణలో సాగిల పడుతున్న మీడియా.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి జగన్ మీద ద్వేషం కక్కుతోంది. ఇందులో ఆంధ్రజ్యోతి కొంచెం నయం. ఎందుకంటే కేసీఆర్ మీద కొద్దిగా గొప్ప వ్యతిరేక వార్తలు రాస్తోంది. అదే సమయంలో తన ఏబీఎన్ ఛానల్ లో మాత్రం మిగతా వాటి లాగానే స్టీల్ ప్లాంట్ పై నిరాధార వార్తలు ప్రసారం చేసింది. అంటే మీడియా అధిపతులకు హైదరాబాదులో ఆస్తులు ఉండడంతో వారంతా కేసిఆర్ కు సాగిల పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్ళతో దున్నుతా అని కేసీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ9, ఏబీఎన్ ఛానల్ మీద నిషేధం ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు పిలవబోమంటూ వీ6 వెలుగును బ్యాన్ చేశారు..

స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలో కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి అంత సత్తా ఉంటే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలను తెరవచ్చు కదా అని డిమాండ్ చేస్తున్నాయి. తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని, దీనికోసం తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థని ఫణంగా పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వానికి అంత దమ్ము కనుక ఉండి ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు బయ్యారం వద్ద ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు.. కానీ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నాయి. ఇక ఇలాంటి విషయాలను ప్రొజెక్ట్ చేయడంలో తెలుగు మీడియా దారుణంగా విఫలమవుతోంది. ఒకటి రెండు మినహా మిగతా మీడియా సంస్థలు కేసీఆర్ ముందు సాగిల పడుతుండడం విస్మయాన్ని కలిగిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular