Modi Politics: మోడీకి వారసుడు లేడు.. ఇక రారు..!

Modi Politics: రాజకీయాల్లో ‘రాచరిక’ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఒక మర్రి చెట్టు కింద చెట్లు ఎందుకు మొలవవో తెలుసా? ఉత్తరకొరియా నియంత తన కుటుంబంలో తనకు పోటీ అయిన అందరినీ చంపేశాడన్న విషయం తెలుసా? వెనుకటికి రాజులు కూడా తమ సింహసనానికి పోటీగా వచ్చే ఎవ్వరిని బతకనివ్వరు. ‘బాహుబలి’ సినిమా కాన్సెప్ట్ కూడా అదే. అయితే ఇప్పుడు రాజకీయాల్లోనూ అలాంటివి జరుగుతుంటాయి. కానీ అంత క్రూరంగా అవి ఫోకస్ కావు. కేవలం తమ రాజ్యాధికారానికి పోటీగా […]

Written By: NARESH, Updated On : September 14, 2021 11:56 am
Follow us on

Modi Politics: రాజకీయాల్లో ‘రాచరిక’ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఒక మర్రి చెట్టు కింద చెట్లు ఎందుకు మొలవవో తెలుసా? ఉత్తరకొరియా నియంత తన కుటుంబంలో తనకు పోటీ అయిన అందరినీ చంపేశాడన్న విషయం తెలుసా? వెనుకటికి రాజులు కూడా తమ సింహసనానికి పోటీగా వచ్చే ఎవ్వరిని బతకనివ్వరు. ‘బాహుబలి’ సినిమా కాన్సెప్ట్ కూడా అదే. అయితే ఇప్పుడు రాజకీయాల్లోనూ అలాంటివి జరుగుతుంటాయి. కానీ అంత క్రూరంగా అవి ఫోకస్ కావు. కేవలం తమ రాజ్యాధికారానికి పోటీగా ఉండేవారిని తప్పిస్తుంటారు.

ప్రధాని మోడీ కేంద్రంలో ప్రధాని అయ్యాక సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జశ్వంత్ సింగ్, ఉమాభారతి, తాజాగా ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ సహా చాలా మంది సీనియర్లు రిటైర్ అయిపోయారు. కాదు కాదు.. మోడీనే రిటైర్ చేయించారన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో పోటీదారులను సులువుగా బీజేపీలో తప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాజకీయంలోనూ అదే పునరావృతం అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది.

గుజరాత్ రాజకీయాల గురించి ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అక్కడి ముఖ్యమంత్రి విజయ్ రూపాని రాజీనామా చేసి ఆ బాధ్యతలను భూపేంద్ర పటేల్ కు అప్పగించారు. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఇలా ముఖ్యమంత్రి మారడంపై రకరకాలుగా అనుకుంటున్నారు. అందులోనూ 2022 అసెంబ్లీ ఎన్నికలు ఉండగా సీఎం మార్పుపై తీవ్ర చర్చ సాగుతోంది. గుజరాత్ లో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు నరేంద్ర మోదీ. ఆ తరువాత ఎవరూ పూర్తికాలం సీఎం గా కొనసాగలేకపోతున్నారు. పూర్తికాలం కాకముందే సీఎం సీట్లో నుంచి వైదొలుగుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉందని అంటున్నారు..

నరేంద్ర మోడీ గుజరాత్ ఐకాన్ సీఎంగా పేరు తెచ్చుకున్నాడు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. 2001 అక్టోబర్ 3న అనూహ్య పరిణమాల మధ్య గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత నరేంద్ర మోదికి ఆ అవకాశం దక్కింది. ఇక అక్కడి నుంచి మోదీ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తన హయాంలో పలు అభివృద్ది పనులు చేపడుతూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన చేసే పనులకు కేంద్ర నాయకత్వం గానీ.. రాష్ట్రంలోని ప్రతిపక్షం గానీ అడ్డు చెప్పలేదంటే నరేంద్ర మోదీ అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకవేళ తనకు రాజకీయంగా ఆటంకాలు ఎదురైనా తన రాజకీయ చతురతతో సమస్యను పరిష్కరించేవారు.

గుజరాత్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన మోదీకి కేంద్ర రాజకీయాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో అప్పటి వరకు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఆయన 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ఆ తరువాత గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ కు అవకాశం ఇచ్చారు. అయితే రెండేళ్ల తరువాత అంటే 2016 ఆగస్టు 1న ఆనందీ బెన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. వయో పరిమితి కారణంగా పార్టీ చెబుతున్నప్పటికీ, పటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమం కారణంగా రాజీనామా చేశారని ప్రచారం సాగింది.

ఆనందీ బెన్ పటేల్ రాజీనామా తరువాత ఎవరూ సీఎంగా కొనసాగుతారని కొన్ని రోజులు చర్చ సాగింది. పార్టీలోని కింది స్థాయి నాయకులకు ఎవరు సీఎం అనేదీ అర్థం కాలేదు. దీంతో అమిత్ షా గుజరాత్ లో పర్యటించారు. అప్పటికే నితిన్ పటేల్ పేరు వినిపించింది. దీంతో ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా విజయ్ రూపానీ వెలుగులోకి వచ్చాడు. విజయ్ రూపానీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంవంత్సరానికే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ సాగింది. కానీ విజయ్ రూపానీనే తిరిగి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.

ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధించి 2021 సెప్టెంబర్ 11 వరకు రూపానీ సీఎంగా కొనసాగారు. ఇప్పుడు ఆయనను సాగనంపారు. నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన విజయ్ రూపానీ సీఎంగా తప్పించడంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఓ వైపు పటీదార్ల నిరసన ఉధృతం కావద్దనే ఆలోచనతో ఆయనను తప్పించారని అంటున్నారు. మరోవైపు వారిని ఆకట్టుకునేందుకు పటీదార్ల సామాజిక వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ ను నియమించారని అంటున్నారు.

నరేంద్ర మోదీ తరువాత గుజరాత్ లో పూర్తిస్థాయిగా ఎవరూ సీఎంగా కొనసాగలేకపోతున్నారు. ఇందుకు మోదీ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. గుజరాత్ పై మోదీ పట్టు ఎప్పటికీ కొనసాగేలా ఉండేందుకే సీఎంలను మార్పు చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు సీఎంగా ఎవరు కొనసాగినా ఆ క్రెడిట్ అంతా మోదీ ఖాతాలోకే వెళ్లింది. ఇకపై కూడా అలానే కొనసాగేందుకు మోదీ ఎవరినీ తన వారసుడిగా తీసుకురావాలని అనుకోవడం లేదని అంటున్నారు. గుజరాత్ లో నేత బలపడితే అది మోడీ చరిష్మాకే ఎఫెక్ట్ అని.. అందుకే పట్టు నిలుపుకునేందుకే మోడీ ఇలా సీఎంలను మారుస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.