రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారం. అది గెలుపు ద్వారానే సాధ్యం. కాబట్టి.. తన బలం పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇంత వరకూ ఓకే. కానీ.. అందుకోసం ఏ మార్గాన్ని అనుసరిస్తుంది అన్నది కీలకం. తమ విధానాలను ప్రచారం చేసుకోవడం ద్వారా.. ప్రజల మద్దతు కూడగట్టుకుంటుందా? మరో విధంగా ప్రయత్నాలు సాగిస్తుందా? అన్నది చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న ఓ కొత్త నిర్ణయం ఈ చర్చను ముందుకు తెచ్చింది. మోడీసర్కారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ చర్యకు సిద్ధపడిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. మరి, అంత పెద్ద నిర్ణయం బీజేపీ ఏం తీసుకుందన్నది చూద్దాం.
ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విస్తరణలో కొత్తగా ఓ శాఖను ఏర్పాటు చేశారు. అదే కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ. దీన్ని రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయంగా చెబుతున్న విపక్షాలు.. రాష్ట్రాల హక్కులను హరించేందుకు, రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడడమేనని వ్యాఖ్యానిస్తున్నాయి. సహకార సంఘాలు అనేవి కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశమని రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ స్పష్టంగా చెబుతోందని అంటున్నాయి. నిపుణులు, మేధావులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. అయినప్పటికీ.. కేంద్రం ఈ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకునేందుకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సహకార శాఖను ఏర్పాటు చేసిన కేంద్రం.. దానికి మంత్రిగా అమిత్ షాను నియమించడం పట్ల కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీలు కూడా మండిపడుతున్నాయి. బీజేపీ రహస్య ఎజెండాను అమలు చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయం రాష్ట్రాల హక్కులపై దాడిచేయడమేనని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీ మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది.
దేశవ్యాప్తంగా సుమారు 1,94,195 డెయిరీ (పాల) సంఘాలు ఉన్నాయి. 330 వరకు సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. నాబార్డ్ అంచనాల ప్రకారం.. 95,238 వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. 363 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు ఉన్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇవన్నీ.. ఆయా రాష్ట్రాల పరిధిలో కొనసాగుతాయి. రాజ్యాంగం కూడా వీటిపై హక్కు రాష్ట్రాలదేనని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ.. కేంద్రంలోని బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం వేరే ఉందంటున్నారు విశ్లేషకులు.
ఈ సహకార సంఘాల్లో బీజేపీకి సరైన ప్రాతినిథ్యం లేదన్నది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలే ఇక్కడ బలంగా ఉన్నాయి. సహకార సంఘాల ఎన్నికల్లో ఈ పార్టీలే సత్తా చాటుతాయి. అందువల్ల.. బీజేపీ బలం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర పరిధిలో లేని సహకార శాఖను ఏర్పాటు చేయడం.. దానికి అమిత్ షాను సారధిగా నియమించడం వెనుక ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు. మరి, దీనికి కాషాయ నేతలు ఎలాంటి సమాధానం చెబుతారో?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why central bjp govt has formed corporation ministry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com