
జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీలు ప్రత్యర్థులు. వాటి మధ్య పచ్చిగడ్డి వేసినా వేయకున్న భగ్గుమంటుంది. కానీ వీరిద్దరికీ తెలంగాణలో కొరకరాని కొయ్యగా మారిన అధికార పార్టీని ఓడించాలని తపన పడుతున్నారు. ఒకరేమో అధికార పార్టీ చేతిలో రెండు సార్లు దెబ్బతిన్న పార్టీ.. మరొకరేమో.. ఎప్పటికైనా కొరకరాని కొయ్యగా మారబోతున్న ప్రాంతీయ పార్టీ నేతను కట్టడి చేయాలని యోచిస్తున్నారు. ఇలా ఇద్దరు జాతీయ ప్రత్యర్థులు తెలంగాణలో ప్రాంతీయ పార్టీపై ఫైట్ చేయడానికి తెరవెనుక సహకరించుకుంటున్నారా? ఆ ఉపఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం ఇంకా అభ్యర్థిని నిలబెట్టకపోవడం వెనుక కారణం అదేనా? అంటే ఔననే అంటున్నాయి రాజకీయవర్గాలు..
వాళ్లద్దరికి రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్.. బలమైన ఆ అధినేతను ఓడించి ఎలాగైనా సరే 2023లో అధికారం సంపాదించాలి. ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షాల పార్టీల యువ నేతలు స్కెచ్ గీస్తున్నారు. ఈ యువ నేతలు పాదయాత్ర నుంచి మొదలుకొని.. పార్టీ ప్రక్షాళన.. చేరికల వరకు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా వచ్చిన ఉప ఎన్నిక ఆ ఇద్దరిని కలవరపెడుతోంది. బలమైన అధికార పార్టీని ఢీకొట్టడానికి ఓడించడానికే వారిద్దరూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తన బద్ద శత్రువు అయినా సరే .. ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఇటీవలే బాధ్యతలు తీసుకున్న ఆయన ఫిక్స్ అయ్యారట..
నిజానికి ఇటీవలే పార్టీ బాధ్యతలు తీసుకున్న ఆయన అసలు అక్కడ గెలుపు కోసం ఆలోచించడం లేదు. బలమైన అభ్యర్థిని పెట్టకముందే అక్కడ తన పార్టీ గెలవదని ప్రకటించాడు. అలిగిన ఆ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరిపోయాడు. ఇక ఆయన ప్లేసులో కొత్త వారిని ఇన్ చార్జిని నియమించలేదు. కనీసం పార్టీ టికెట్ ఎవరికన్నది చెప్పడం లేదు. బయటకొచ్చి అధికార పార్టీతో పోరాడుతున్న ప్రత్యర్థియే గెలుస్తాడని ఆ పార్టీ చీఫ్ బలంగా నమ్ముతున్నాడు. అధికార పార్టీని ఓడించడమే ధ్యేయంగా ఆ సీటును త్యాగం చేయాలని చూస్తున్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ బలమైన ప్రత్యర్థిని తన పార్టీలోకి రమ్మని ఎంతగానో ప్రయత్నించిన పార్టీ చీఫ్ ఆయన బాధలు విని… కేసుల రక్షణకోసం పెద్ద పార్టీలో చేరడం చూసి ఇక ఆయనే గెలుస్తాడని ఫిక్స్ అయ్యాడట.. తన టార్గెట్ అధికార పార్టీ అందుకే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని కూడా సమాయత్తం చేయకుండా కాలయాపన చేస్తున్నాడట..
ఇప్పుడా ఉప ఎన్నికల్లో ‘త్రిముఖ పోటీ’ కాస్త ద్విముఖ పోరుగా మారబోతోంది. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం అస్సలు అక్కడ పోటీకి ఆసక్తి చూపించకపోవడమే కారణమట.. అధికార పార్టీని ఓడించడానికి.. తన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలిచినా పర్లేదు అని కొత్త చీఫ్ భావిస్తున్నాడట.. మంచి అభ్యర్థి అయిన ఆయన గెలవాల్సిన అవసరం ఉందని కొత్త చీఫ్ భావిస్తున్నాడట.. ఇలా తెలంగాణ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ప్రత్యర్థులైన రెండు బలమైన పార్టీల మధ్య ఒక్క అభ్యర్థి కోసం స్నేహం వెల్లివిరియడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
యువ చీఫ్ ముందే మేం అక్కడ గెలవం అని ప్రకటించేశాడు. తన పార్టీ అభ్యర్థి అధికార పార్టీలో చేరినా పెద్దగా స్పందించడం లేదు. అక్కడ బలమైన ప్రత్యర్థిని నింపాలని శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఇక్కడ అధికార పార్టీని ఓడించేందుకు ఈయన కాంప్రమైజ్ అవుతున్నారా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.