తెలంగాణలో ఇప్పుడు మంత్రి ఈటల రాజేందర్ వివాదం సంచలనమైంది. ఆయన భూకబ్జా చేశారని కేసీఆర్ సర్కార్ విచారించడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఈటలను టీఆర్ఎస్ నుంచి పంపించి వేసేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన మద్దతుదారుల నుంచి వినిపిస్తున్నాయి. పొమ్మనలేక పొగబెడుతున్నారని అంటున్నారు.
అయితే మంత్రి ఈటల మంత్రి పదవి పోవడం ఈ ఎపిసోడ్ లో ఖాయమని.. ఈటలతోపాటు మరికొందరు మంత్రులపై కూడా వేటు పడుతుందనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
ఈటలను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించడమే ధ్యేయంగా కేసీఆర్ విచారణకు ఆదేశించారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ఈ అవినీతి అక్రమాలు వెలుగుచూశాయని అంటున్నారు.
ఇక కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే రాజీనామా చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టు సమాచారం. ఆయన వద్ద పనిచేసిన పీఎస్ అవినీతి కారణంగా ఈయనకు ఎఫెక్ట్ పడిందని అంటున్నారు.
ఇప్పుడు ఈటెలతోపాటు మరికొందరికి మూడిందని.. కేసీఆర్ కేబినెట్ విస్తరణలో ఎంతలేదన్న ఐదుగురు మంత్రుల పోస్టులు గల్లంతు కావడం ఖాయమన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.