Pawan Kalyan Bus Yatra: పవన్ కళ్యాణ్ యాత్ర కోసం బస్సు సిద్ధమైంది. కాన్వాయ్ వాహనాలను సిద్ధం చేశారు. ఇంతకీ పవన్ యాత్ర ఎప్పుడు? అని జన సైనికులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వారికి తమ అభిమాన నటుడు, నాయకుడు కాబట్టి ఆతృత కామన్. కానీ అధికార పక్షంతో పాటు ప్రధాన విపక్షంలో అయితే ఒకటే టెన్షన్. మిలటరీ స్టీల్ బాడీతో బస్సును రూపొందించారు. అచ్చం ఎన్టీఆర్ చైతన్య రథం మాదిరిగా తయారుచేశారు. కానీ బస్సు ‘సిద్ధమైన యాత్ర చేయలేకపోతున్నారంటూ వైసీపీ బ్యాచ్ సెటైర్లు మొదలుపెట్టింది. సాక్షితో పాటు వైసీపీ అనుకూల మీడియా మొత్తం వ్యతిరేక కథనాలు వండి వార్చుతోంది. అయితే యాత్ర ఎప్పుడు చేపట్టాలన్నది పవన్ ఇష్టం. కానీ ఆయన బస్సు యాత్ర చేయరని.. కొత్తగా మూడు సినిమా ప్రాజెక్టులకు సైన్ చేశారంటూ నానా యాగీ చేస్తున్నారు. ‘శని, ఆదివారాల్లో రాజకీయాలు చేసి.. మిగతా రోజుల్లో సినిమాలు చేసుకుంటున్నారు. ఆయనకు బద్దకం ఎక్కువ..బస్సు యాత్ర ఆయనెక్కడ చేయగలడు’ అంటూ ఏవేవో చిలువలు పలువలు చేస్తున్నారు.

అసలు బస్సు యాత్ర ఫలానా రోజు ఉంటుందని జనసేన ఎప్పుడూ ప్రకటన చేయలేదు. అక్టోబరు నుంచి తలపెట్టాలనుకున్నా నియోజకవర్గ రివ్యూలతో వాయిదా వేశారు. అటు తరువాత అమరావతి రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేపడుతున్న సమయంలో తాను బస్సు యాత్ర చేపడితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని పవన్ బస్సు యాత్రను విరమించుకున్నారు. విశాఖలో జనవాణిని అడ్డుకోవడం, ఇప్పటం గ్రామంలో ఇళ్లను ధ్వంసం చేయడం వంటి ఘటనలతో అధికార పార్టీ దాష్టీకానికి పాల్పడింది. కేవలం పవన్ ను కార్నర్ చేసుకొనే కవ్వింపు చర్యలకు పాల్పడింది, అటు బాధితులకు అండగా ఉంటూ.. భరోసా కల్పిస్తూ పవన్ విలువైన క్షణాలను సైతం ప్రజల కోసం కేటాయించారు. అయితే ఇది అధికార పక్షానికి మింగుడు పడడం లేదు. అందుకే తమది కాని వ్యవహారమైన పవన్ బస్సు యాత్ర గురించి పదే పదే ప్రశ్నిస్తున్నారు. అనుకూల మీడియాలో పవన్ కు వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారు.
పవన్ కాన్వాయ్ కు వాహనాలు సమకూర్చుకుంటేనే అధికార వైసీపీ నేతలు సహించుకోలేకపోయారు. ఆ వాహనాలపై లేనిపోని ప్రచారం చేశారు. జనసేనతో పాటు పవన్ పై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై జనసైనికులతో పాటు పవన్ నివృత్తి చేశారు. పవన్ తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో. రెమ్యూనరేషన్ పరంగా కూడా అగ్రస్థానంలో ఉన్నారు. భారీ స్టార్ డమ్ ఉండడంతో ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు సైతం ఎగబడుతుంటారు. అటువంటి పవన్ తాను సినిమాల్లో సంపాదించిన కష్టాన్ని పార్టీకి, ప్రజలకు ఖర్చుపెడుతున్నారు. చివరకు ప్రభుత్వానికి కట్టిన పన్నులను సైతం గణాంకాలతో చెప్పారు. కానీ మైండ్ గేమ్ లో భాగంగా అధికార పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. తమ మందీ మగదులతో చేయిస్తోంది.

ఇప్పటికే పవన్ ప్రజల్లోనే ఉంటున్నారు. తన వృత్తి అయిన సినిమాలను చేస్తూనే రాజకీయాలకు విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారు. అటు బస్సు యాత్రకు కూడా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఏపీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పుడే బస్సు యాత్ర చేపడితే ఆ ఇంపాక్ట్ అనేది ఎన్నికల వరకు తగ్గుతుంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే బస్సు యాత్రకు పూనుకుంటూ ఆ ఊపు ఉత్సాహం వస్తుంది. అందుకే పవన్ ఇలా బస్సు యాత్రను ఎన్నికల సంవత్సరం చివరి ఆరు నెలలకు జరిపారు. ఈలోపు పెండింగ్ సినిమాలు పూర్తిచేసి..తరువాత బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. ఆర్థిక వనరులు సమపార్జించుకోవాలన్నది పవన్ ప్లాన్. అందుకు గ్రౌండ్ ను కూడా రూపొందించుకున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలు, ప్రాంతాలు కవరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. రూట్ మ్యాప్ రూపొందించే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. అయితే సంక్రాంతికి ముందే పవన్ బస్సు యాత్ర షెడ్యూల్ ను ప్రకటించే అవకాశముందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.