Janasena Chief Pawan Kalyan: ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలు తమదైన శైలిలో వ్యూహం పన్నుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోర పరాభావం చెందిన జనసేన ఈ మూడేళ్ల కాలంలో రాజకీయంపై పట్టు సాధిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతూనే.. రాజకీయంగా అనుభవం సాధిస్తున్నాడు. పవన్ ఒకప్పటి ప్రసంగానికి.. నేటి వ్యాఖ్యలకు చాలా తేడా వచ్చింది. ఇప్పడు పవన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా ఐటీ ప్రతినిధుల ముగింపు సభలో చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పదవుల కోసం జనసేనలోకి రావొద్దని చెప్పడం కొత్తచర్చకు దారి తీసింది.

జనసేనపార్టీ ప్రజా సేవ చేయడానికి పెట్టామని, ఏదో అద్భుతాలు సృష్టించాలని పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ అన్నారు. అంతేకాకుండా కేవలం పదవులను ఆశించి మాత్రమే తమ పార్టీలోకి రావద్దన్నారు. అయితే గత కొన్ని రోజుల కిందట అధికార వైసీపీలో అసంతృప్తితో ఉన్నవారు వస్తే పార్టీలోకి చేర్చుకుంటామని పవన్ పరోక్షంగా సన్నిహితులకు సంకేతాలిచ్చారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడెవరైనా వస్తే గేట్లు తెరిచే ఉంచాలని చెప్పారు. మరి ఇప్పుడు పార్టీలోకి వచ్చేవారు పదవులను ఆశించొద్దనడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర పార్టీల్లో ఏ పదవి దక్కనివారే మరో పార్టీ వైపు చూస్తారు. ఇలాంటి సమయంలో ఏ హామీ ఇవ్వకుండా నాయకులెవరు చేరుతారని కొందరు అంటున్నారు.
Also Read: Munugode Bypoll: భారీ ప్యాకేజీల మునుగోడు
అనుభవం లేకుండా పదవులను ఆశించొద్దని పవన్ సభలో అన్నారు. అనుభవం లేకుండా పదవులను పొందితే వైసీపీ ప్రభుత్వం మాదిరిలాగే అవుతుందని అన్నారు. అంతేకాకుండా ఏపీలో శ్రీలంక పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి పరిస్థితులను రాకుండా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అయితే ప్రస్తుతం జనసేలో నాదెండ్ల మనోహర్ మినహా దాదాపు కొత్తవారే కనిపిస్తున్నారు. వారికి రాజకీయ పరిస్థితులు తెలిసినా పదవులు అనుభవించిన సంఘటనలు లేవు. మరి ఇలాంటి వారికి పదవులు దక్కవా..? అన్న ఆందోళన ఆశావహుల్లో మొదలైంది. కానీ మరోవైపు ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి మరోతరాన్ని మేల్కోలపడానికి పార్టీని నడుపుతున్నామని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. దీంతో పవన్ వ్యాఖ్యలపై కాస్త అయోమయం నెలకొంది.
భవిష్యత్ తరాల గురించి తలుచుకుంటే భయంగా ఉందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమగ్రతాభావం కోల్పోకుండా మనమందరం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల శ్రీలంక దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడే ప్రభుత్వం వచ్చినా దానిని పూడ్చడానికే సమయం పడుతుంది. ఏపీలో కూడా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పథకాల పేరిట భారీగా ఖర్చుపెడుతోందని, భవిష్యత్ లో ఒకవేళ జనసేన అధికారంలోకి వచ్చినా అప్పులు తీర్చడానికే సమయం పడుతుందన్న అభద్రతా భావం పవన్ కళ్యాణ్ లో పెరిగినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయన్న ఆశ అందరిలోనూ ఉంది. సీఎం అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే పవన్ సీఎం కావాలన్న డిమాండ్ ఉంది. ఒకవేళ అయినా.. అధికార పార్టీతో కలిసున్నా అప్పుల కష్టాలు తప్పవని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ శ్రీలంక ఇష్యూని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే కోట్ల అప్పుల్లో ఏపీ కూరుకుపోయిందని, ఒకవేళ వైసీపీ అధికారంలో రాకున్నా.. నష్టం ఉండదని.. ఇబ్బందులన్నీ అధికారంలోకి వచ్చే వారికే ఉంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా ఇప్పుడే పదవుల హామీ ఇవ్వలేమని, భవిష్యత్ లో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చినా కొత్త వారికి ఇచ్చి మేనేజ్ చేయవచ్చని.. సీనియర్లు వస్తే ఇవ్వకుంటే అసంతృప్తితో మరో ‘ప్రజారాజ్యం’లా తయారవుతుందన్న భయంతోనే పవన్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read:Telangana Ministers Controversies: మేము మంత్రులం.. మా నియోజకవర్గాలకు సామంత రాజులం
[…] […]