Group 2 : ఏపీలో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల నిలిపివేయాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారు. అందులోఇద్దరు మాత్రమే హారిజాంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం తెలుపుతూ పరీక్షలు నిలపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ పిటిషన్ తో సక్సెస్ అయితే, అప్పుడు మొత్తం ఎగ్జామ్ ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. మెయిన్స్ పరీక్షను నిలిపేస్తే అంత మంది అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందని.. అందువల్లే ఈ పరీక్షను నిలుపుదల చేయలేమని కోర్టు తెలిపింది.
ఈ నెల 23న జరుగనున్న మెయిన్స్ పరీక్ష నిమిత్తం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించొద్దని గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. విశాఖతో పాటు పలు పట్టణాల్లో గ్రూప్-2 అభ్యర్థులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలను తెలిపారు. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు.
అసలేంటి వివాదం
ఏపీలో 899 పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడే గ్రూప్-2కు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆగిపోయాయి. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు ఫిబ్రవరి 23 (ఆదివారం) నాడు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 92,250 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించారు. ఉమ్మడి 13 జిల్లాల్లోని 175 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నోటిఫికేషన్ ప్రకటించిన రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయని అభ్యర్థులు ముందు నుంచీ ఆందోళన చెందుతూనే ఉన్నారు. విశాఖపట్నం, కాకినాడ ప్రాంతాల్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గ్రూప్-2 అభ్యర్థుల స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడింది. రోస్టర్ విధానంలో చోటు చేసుకున్న పొరపాట్లను సరి చేయాలంటూ డిమాండ్ చేసింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష దగ్గరపడుతున్న నేపథ్యంలో హైకోర్టు కూడా తాము జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. అయితే రోస్టర్ విధానంలో తప్పులను సరి చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. రోస్టర్ విధానంలో మార్పులు చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది.