Homeఅంతర్జాతీయంచైనా జనాభా పెంపుదలకు కారణమేంటి?

చైనా జనాభా పెంపుదలకు కారణమేంటి?

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా అన్న సంగతి అందరికీ తెలిసిందే. 2019 జనాభా లెక్కల ప్రకారం చైనా జనాభా సుమారు 140 కోట్లు. దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతోందనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితమే నియంత్రణ చర్యలు చేపట్టింది అక్కడి సర్కారు. ఇందులో భాగంగా ఒక్కరికి, ఇద్దరికి మాత్రమే జన్మనివ్వాలని నిర్ణయం తీసుకుంది. పటిష్టంగా అమలు చేసింది కూడా. అయితే.. తాజాగా మూడో బిడ్డను కనడానికి అనుమతించింది ప్రభుత్వం. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై చైనాలో తీవ్ర చర్చ సాగుతోంది.

జనాభా నియంత్రణపై చైనా అమలు చేస్తున్న కఠిన నిర్ణయాల ఫలితంగా దేశంలో జనాభా నిష్పత్తిలో అంతరం బాగా పెరిగిపోయింది. మగవాళ్లతో పోలిస్తే.. ఆడవాళ్ల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. దీంతో.. దేశంలో దాదాపు 3 కోట్ల మంది పురుషులు పెళ్లిళ్లు కాకుండా మిగిలిపోయారనే లెక్క తేలింది. జరిగిన నష్టాన్ని గుర్తించిన సర్కారు, భవిష్యత్ లోనైనా ఇబ్బందులు రాకుండా చూడాలని వెంటనే స్పందించింది. ఇందుకోసం సంతానోత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. మూడో బిడ్డను జన్మించేందుకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.

అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై మెజారిటీ జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా పేద, మధ్య తరగతి వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయట. దీనికి వాళ్లు చాలా కారణాలు చూపిస్తుండడం గమనార్హం. జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో.. మూడో బిడ్డ పోషణ మరింత భారమవుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. చాలీ చాలని జీవితాలతో ఇద్దరిని పెంచడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో.. మూడో బిడ్డను కని ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక, వర్కింగ్ ఉమెన్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనాలో ఉద్యోగ సంస్థలు కనీసం ప్రసూతి సెలవులు కూడా సరిగా ఇవ్వవని సమాచారం. అంతేకాదు.. కొన్ని సంస్థలైతే ప్రసూతి సెలవుల విషయంలో వారు ముందుగా సూచించిన నిబంధనలకు అంగీకరించిన వారినే ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క బిడ్డను కనడానికే నానా అవస్థలు పడుతున్నప్పుడు.. మూడో బిడ్డకు ఎలా జన్మనివ్వాలని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం ఏ కారణంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ప్రజల స్థితిగతులు మార్చకుంటే ఎలా ఫలితాలనిస్తాయని ప్రశ్నిస్తున్నారు. కనీసం.. ప్రసూతి సెలవుల విషయంలోనూ దేశంలోని ఉద్యోగ సంస్థలకు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండా.. మూడో బిడ్డను కనడానికి అనుమతులు ఇస్తే సరిపోతుందా? అని చాలా మందిప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణ స్థాయిలో చాలా మంది ఒక్క బిడ్డను కనడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల.. ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నా.. ఉపయోగం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular