Sri Lanka Crisis 2022: శ్రీలంకలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కరువు ప్రభావంత తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలకు సైతం ఆహారం దొరకని పరిస్థితి. దేశంలో ఇంతటి దుర్భిక్షం ఎన్నడు చూడలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆహార సంక్షోభంతో అతలాకుతలం అవుతోంది. ధరలు మండిపోతున్నాయి. ఆకలి తీరడం లేదు. ఫలితంగా జనం రోడ్లెక్కుతున్నారు. దేశం తీవ్ర కరువు ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే నార్వే, ఆస్ట్రేలియా, ఇరాక్ లలో రాయబార కార్యాలయాలు మూసివేసింది. ఈ క్రమంలో దేశంలో కరువు కరాళనృత్యం చేస్తోంది.
శ్రీలంకలో ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి రాజపక్స విధానాలే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్ని చైనాకు అమ్మేసి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజపక్స స్వప్రయోజనాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద సంక్షోభం ఏర్పడి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ సంచలన వ్యాఖ్యలు
కొలంబో వీధుల్లోకి అందరు తరలివస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కుతున్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తున్నారు. పోలీసులు విధిస్తున్న ఆంక్షలను సైతం లెక్కచేయకుండా విరుచుకుపడుతున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. అయినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. జనంలో ఆగ్రహం పెల్లుబికుతోంది. పోలీసుల హెచ్చరికలు పట్టించుకోవడం లేదు.
దీనికంతటికి కారణం ప్రభుత్వమేనని చెబుతున్నారు. దేశం ఇంత భారీ సంక్షోభాన్ని చవిచూడటం ఇదే ప్రథమమని గుండెలు బాదుకుంటున్నారు. కరోనా ప్రభావంతోనే దేశం ఇంత తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నా ప్రభుత్వ విధానాలే ఈ పరాకాష్టకు కారణమని విమర్శలు చేస్తున్నారు. ఎంపీల ఇళ్ల వద్ద జనం నినాదాలు చేస్తున్నారు. ప్రెసిడెన్సియల్ సెక్రటేరియట్ తో పాటు మంత్రుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశ సంక్షోభం దృష్ట్యా ప్రతిపక్షాలు సహకరించాలని కోరుతున్నా అవి ససేమిరా అంటున్నాయి. స్వయంకృతాపరాధంతోనే దేశాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపిస్తున్నాయి. దేశంలో ఆహారం, మందులు, ఇంధనం దొరకడం లేదని వాపోతున్నాయి. దీంతో పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ మరింత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
నిత్యావసరాల ధరలైతే ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు, కూరగాయలు, ఆహార పదార్థాలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా వారు ఏం కొనేందుకు సిద్ధంగా లేరు. ధరల పెరుగుదల వారిని కుంగదీస్తోంది. మిరపకాయలు కిలో రూ. 400లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో శ్రీలంక సంక్షోభం సమసిపోయే దారులు మాత్రం కనిపించడం లేదు. భవిష్యత్ పై ఆశలు వదులుకుని జనం అల్లాడుతున్నారు.
శ్రీలంకలో సంక్షోభానికి ఐఎంఎఫ్ స్పందించినా పరిస్థితులు మారడం లేదు. లంకలో రాజకీయ, ఆర్థిక పరిణామాల్లో మార్పులు తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ దుర్భిక్ష పరిస్థితుల్లో లంకను ఏ దేశం ఆదుకుంటుందో పరిస్థితిని ఎలా అదుపు చేస్తారో వేచి చూడాల్సిందే.
Also Read:Priyanka Chopra: ఇంట్రెస్టింగ్ పిక్ పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా