Atishi Marlena: మద్యం కుంభకోణం కేసులో సుమారు ఐదున్నర నెలలు జైల్లో ఉన్న ఢిల్లీ సీఎంకు సుప్రీం కోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండే మద్యం కేసులో వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. ఈడీ కేసులో మొదట బెయిల్ వచ్చింది. సీబీఐ కేసులో బెయిల్ ఆలస్యం కావడంతో ఐదున్నర నెలలు జైల్లో ఉన్నారు. జైలు నుంచే పాలన వ్యవహారాలు చూసుకున్నారు. సుప్రీం కోర్టు కూడా సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో సీఎం హోదాలోనే జైల్లో ఉన్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ప్రజల తీర్పు కోరతానని ప్రకటించారు. అందుకోసం సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ, కేజ్రీవాల్ వెనక్కి తగ్గలేదు. ముందుగా చెపిపనట్లే.. మంగళవారం(సెప్టెంబర్ 17న) పదవికి రాజీనామా చేశారు. బెయిల్ సందర్భంగా సుప్రీం కోర్టు.. విధించిన నిబంధనలు కూడా సీఎం పదవి వీడడానికి కారణంగా చెబుతున్నారు. ఏ సంతకం చేయాలన్నా.. లెఫ్ట్‌నెంట్ జనరల్ అనుమతి తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ పదవి నుంచే తప్పుకున్నారు.
ఢిల్లీ పీటంపై మహిళ..
ఇక తన స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త సీఎంగా మహిళను నియమించారు. ఆప్ పార్టీకి చెందిన మంత్రి అతిషిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. మంగళవారం నిర్వహించే ఆప్ శాసన సభా పక్ష సమావేశంలో పార్టీ శాసన సభా పక్ష నేతగా అతిషిని ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీ పీటంపై మరోసారి మహిళ కూర్చోనున్నారు. సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత మరో మహిళ అషితి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
విధేయతకు పట్టం..
ఇదిలా ఉంటే.. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవిని విధేయురాలుకు అప్పగించారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు అతిషి సీఎం అరెస్టుపై పోరాటం చేశారు. దీక్ష చేపట్టారు. దీంతో కేజ్రీవాల్ వారసురాలిగా ఎదిగారు. 41 ఏళ్ల అతిషి పార్టీలో కీలకంగా మారారు. ఇటీవల ఢిల్లీ నీటి సంక్షోభం సమయంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు.
ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో..
మంగళవారం జరిగిన ఆప్ శాసనసభా పక్ష సమావేశంలో ఆ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యేలు తదుపరి ముఖ్యమంత్రిని కేజ్రీవాల్‌నే నిర్ణయించాలని కోరారు. చీఫ్ విప్ దిలీప్ పాండే అరవింద్ కేజ్రీవాల్ తన వారసుడిని నిర్ణయించే ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దీని తరువాత కేజ్రీవాల్ అతని తరువాత అతిషిని నియమించారు. ఈ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు సాయంత్రం 4:30 గంటలకు సమర్పించనున్నారు, దీంతో తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమం అవుతుంది.
ఫిబ్రవరిలో ఎన్నికలు..
ఇదిలా ఉంటే.. 2025, ఫిబ్రవరిలో ఢిల్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు అతిషి సీఎంగా ఉంటారు. ఇక ఏజ్రీవాల్ ఇప్పటి నుంచే పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లనున్నారు. పోల్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతు ఇస్తే తాను నిర్దోషినే అని కేజ్రీవాల్ ప్రకటించారు.