Homeజాతీయ వార్తలురూ 20 లక్షల కోట్ల ప్యాకేజి అంకెల గారడీయా!

రూ 20 లక్షల కోట్ల ప్యాకేజి అంకెల గారడీయా!


కరోనా కారణంగా కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించినప్పుడు దేశంమంతా హర్షం వ్యక్తమైనది. ప్రజలలో నూతన ఆశలు చేకూరాయి. కానీ ఊరించి, ఊరించి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజులపాటు వరుసగా ప్రకటించిన ప్యాకేజి వివరాలు అస్పష్టతను కలిగించాయి.

ఇంతకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని అడిగితే “మేము ఎన్ని నిధులు ఇచ్చామని కాదు … ప్రజలకు ఏమి అందిందో చూడండి” అంటూ ఆమె సమాధానం ఇచ్చారు. గతంలో ఉన్న పథకాలకు కొద్దో, గొప్పో అదనంగా అంకెలు కలిపారు. వివిధ సంస్థల ద్వారా కొన్ని వెసులుబాట్లు కల్పించారు. కానీ అవన్నీ ప్రజలకు ఏమేరకు, ఏ విధంగా చేరతాయో స్పష్టత లేదు. దానితో ఇదంతా అంకెల గారడీనే అని విపక్షాలు ధ్వజమెత్తాయి.

రూ. 20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ సర్కారు చెప్తున్నట్లుగా దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం ఎంతమాత్రం కాదని, 1.6 శాతమేనని ఆ పార్టీ అధికారప్రతినిధి ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. దేశ ప్రజలను మోసపూరిత, అసత్య, జిత్తులమారి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి, పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా సంస్థల చేతుల్లోకి నగదును అందించేందుకు ప్రధాని మోదీ తప్పక మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే’ అని శర్మ డిమాండ్‌ చేశారు. ఈ ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చకు సవాల్‌ విసిరారు.

ఇక మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వ అదనపు ఆదాయం, ఖర్చుల కోసం ప్రకటించిందే తప్ప కరోనా బాధిత రంగాల కోసం కాదని ఎద్దేవా చేశారు.

కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లుగా ఉన్నా.. బడ్జెట్‌పై ప్రభావం మాత్రం రూ.1.50 లక్షల కోట్లేనని బార్క్‌లేస్‌ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా తెలిపారు. జీడీపీలో ఇది 0.5 శాతమేనని గుర్తుచేశారు. ఈ అంచనా కరోనా సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోదీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుండటం గమనార్హం.

మొత్తం ప్యాకేజీలో ఆర్బీఐ గతంలో ప్రకటించిన నిర్ణయాల విలువే రూ.8 లక్షల కోట్లుగా ఉన్నది. మరోవైపు మొత్తం ప్యాకేజీలో ఖజానాపై పడుతున్న భారం చాలా తక్కువేనని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారు డీకే శ్రీవాత్సవ పేర్కొన్నారు.

కాగా, ప్యాకేజీపై రిటైలర్ల సంఘం కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమను ఏమాత్రం ఆదుకోలేదని భారతీయ రిటైలర్ల సంఘం సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version