KA Paul: నడిరోడ్డుపై ఐటెం సాంగ్ లు వేసుకొని ఎగురుతాడు.. బుడ్డగోషి పెట్టుకొని రైతులా పొలం పనులకెళతాడు.. చిన్న పిల్లలతో కలిసి స్ట్రీట్ డ్యాన్స్ చేస్తాడు.. హోటల్స్ కెళ్లి దోశలు వేస్తాడు.. అసలు రాజకీయాల్లో కంటే సినిమాల్లోకి వెళితే మన కేఏ పాల్ ఇరగ్గొట్టేస్తాడు. కానీ రాజకీయాలంటే పిచ్చినో మరేదో కానీ.. ఇక్కడే తన నటన అభినయం అంతా ప్రదర్శిస్తాడు. ఈ హీట్ లోనూ నవ్వులు పూయిస్తాడు. మునుగోడు వేడిలో నవ్వులు పూయించిన కేఏ పాల్ తాజాగా మరోసారి కామెడీ చేశాడు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా కేఏ పాల్ ధీమా చూస్తుంటే నవ్వకుండా ఎవరూ ఉండరు మరీ.

ఓపక్క టీఆర్ఎస్, బీజేపీ కొట్టుకు చస్తుంటే.. మధ్యలో కాంగ్రెస్ దూరి ఆగమాగం చేస్తోంది.. మునుగోడులో ఈ మూడు పార్టీల మధ్యే పోరు నడిచింది. అంతిమంగా ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ దే గెలుపు అని తేటతెల్లమైంది. అయినా కూడా ఆశచావని కేఏ పాల్.. మునుగోడులో గెలుపు నాదే.. 50వేల మెజార్టీ గ్యారెంటీ అంటున్నాడు.. ఈ ప్రకటన చూశాక ‘పాల్’ ను చూసి జనాలకు , నేతలకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కానీ పరిస్థితి.. అంతే మరీ ‘కేఏ పాల్’ నా మజాకా?..
దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు ప్రచారం జరుగుతున్న మునుగోడులో ఓటర్ల తీర్పు ఈవీఎల్‌లలో నిక్షిప్తమైంది. ఈనెల 6న ఫలితం వెలువడనుంది. సర్వశక్తులో ఒడ్డి పోరాడిన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఫలితంపై ఉత్కంఠతో జయాపజయాలపై లెక్కలు వేసుకుంటుంటే.. ఇండిపెండెంట్‌గా పోటీచేసిన తానే విజయం సాధించబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 50 వేల మెజారిటీ సాధిస్తానని ప్రకటించారు.
ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ..
రెండు నెలలుగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన మునుగోడు ఉపఎన్నికల ప్రక్రియ ముగిసింది. మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఈ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదయింది. గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 93.13 శాతం మంది ఓటు వేశారు. పోలింగ్ భారీ స్థాయిలో నమోదుకావడంతో.. ఇది ఎవరికి కలిసి వస్తుంది? ఎవరిని ముంచుతుంది? అనే దానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. మునుగోడులో గులాబీ జెంగా ఎగరడం ఖాయమని టీఆర్‌ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వారికే అనుకూలంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ.. మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని కాషాయదళం ఢంకా బజాయిస్తోంది. వీళ్లంత కాన్ఫిడెన్స్ లేకున్నా.. తామే గెలుస్తామని కాంగ్రెస్ కూడా చెబుతోంది. కానీ మూడు పార్టీల్లో మాత్రం ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
విజయంపై కేఏ.పాల్ ధీమా..
ఐతే మునుగోడులో ఈ మూడు పార్టీల్లో ఏదీ గెలవదంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తానే విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు మొనగాడిని తానే అని ప్రకటించారు. నియోజకవర్గ మొత్తం తనకు బ్రహ్మరథం పట్టారని ప్రకటించుకున్నారు. పోలైన ఓట్లలో 80 శాతం తనకే పడ్డాయని, 50 వేల మెజారిటీతో గెలవబోతున్నానని జోస్యం చెప్పారు కేఏ పాల్.
ఇదేం లెక్కరా అయ్యా..
మునుగోడులో తాను ఎలా గెలవబోతోంది కూడా కేఏ.పాల్ ప్రకటించారు. ఉత్సాహంగా ఓటేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘బీజేపీ వాళ్లు రూ.30 వేలు ఇస్తామని రూ.3 వేలు ఇచ్చారు. టీఆర్‌ఎస్ వాళ్లు తులం బంగారం, రూ.30 వేలు ఇస్తామని రూ.3 వేలు ఇచ్చారు. కాంగ్రెస్ ఎలాగూ ఓడిపోతామని తెలిసి రూ.500, వెయ్యి వరకు ఇచ్చింది. యూత్ నిరుత్సాహానికి గురికావొద్దు. మనకు మంచి రోజులు వచ్చాయి. 1.05 లక్షల మంది యువత ఓటు వేశారు. కొన్ని చోట్ల నాకు 60 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని చోట్ల 70, 80 శాతం ఓట్లు పడ్డాయి. కనీసం 50 వేల మెజారిటీతో నేనో గెలుస్తున్నా.. కేసీఆర్‌ని చిత్తు చిత్తుగా ఓడించినందుకు నాకు హ్యాపీగా ఉంది. అందరూ ఈవీఎంలను కాపాడుకోవాలి. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలకు రెండు రోజులు కాపాడుకుంటే ఫలితం దక్కుతుంది’ అని కేఏ.పాల్ లెక్కలతో సహా చెప్పుకొచ్చారు.

బరిలో 47 మంది..
ఇక మునుగోడు ఉపఎన్నికల బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉండగా.. భారతీయ జనతాపార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిరెడ్డి నిలబడ్డారు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారన్న దానిపై ముగ్గురు అభ్యర్థులు, మూడు పార్టీలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. స్వతంత్ర అభ్యర్థి కేఏ.పాల్ మాత్రం తనతైన మాటలతో మునుగోడు ఓటర్లకు, తెలంగాణ ప్రజలకు మరోసారి హాస్యం పంచారు. కాసేపు నవ్వుకునేలా తానే గెలుస్తున్నట్లు ప్రకటంచి ఆకట్టుకున్నారు.