BJP- CM KCR: తెలంగాణ విడిపోయాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే ఎక్కువ సంపాదించిన కేసీఆర్ ఆగమాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 63మంది ఎమ్మెల్యేలతో కేసీఆర్ సర్కార్ ఏర్పడింది. మ్యాజిక్ మార్క్ 60 ఎమ్మెల్యేలే. దీంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముందుగా బీఎస్పీ తరుఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చి చేర్చుకున్నారు. ఆ తర్వాత టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల లాంటి ఎంతో మందిని చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు.

2014 ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్ 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులోని చాలా మందిని లాగేసిన కేసీఆర్ ముందు తన కుర్చీ పదిల పరుచుకున్నారు. వారితో రాజీనామా కూడా చేయించుకుండానే చేర్చుకున్నారు.
ఇక 2019 ఎన్నికల్లోనూ క్లియర్ కట్ గా 80కి పైగా సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కనీసం రాజీనామా కూడా చేయించుకోలేదు. అంటే కేసీఆర్ చేస్తే అది సంసారం.. ఇప్పుడు బీజేపీ చేస్తే అది వ్యభిచారం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ వైఖరి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. ఈ కేసులో బీజేపీ నేతలపై ఆరోపిస్తూ వీడియోలు ప్రదర్శించిన కేసీఆర్ పై బీజేపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటిగా ఇదే మాట అన్నారు. అసలు ఎవరో స్వామీజీలను తీసుకొచ్చి చూపించిన ఈ షో ఒక కట్టు కథలా ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశమే లేదు. ఎందుకంటే 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆయన చెంత ఉన్నారు. వీడియోలోనూ కూలగొడుతామని వాళ్లు చెప్పలేదు. ఇక స్వామీజీలకు ప్రభుత్వాలు పడగొట్టే సామర్థ్యాలున్నాయా?
ఇక కేసీఆర్ ఈ ఆటలో అరటిపండుగా కీలకంగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే. టీఆర్ఎస్ లోకి అక్రమంగా వచ్చిన వారే. ఆయనను నీతిమంతుడిగా కేసీఆర్ ప్రొజెక్ట్ చేయడమే ఇక్కడ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. కేసీఆర్ ప్రెస్ మీట్ లో తన పక్కన కూర్చుండబెట్టుకున్న.. ఫాంహౌస్ కొనుగోళ్లలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇరత పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారే. ఒక గువ్వల బాలరాజు మాత్రమే టీఆర్ఎస్ నుంచి గెలిచారు. పక్కపార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను హైజాక్ చేసి బీజేపీ కొంటోందంటున్న కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి నీతులు వళ్లించడాన్ని అందరూ ఎద్దేవా చేస్తున్నారు.

బ్రోకర్ల ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీ నేతలను చేర్పించుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే పనిచేస్తోందంటూ బీజేపీపై ఆడిపోసుకోవడమే విడ్డూరంగా ఉంది. కేసీఆర్ కావాలనే బీఆర్ఎస్ పేరిట వచ్చేందుకు బీజేపీని టార్గెట్ చేశారని అర్థమవుతోంది.
కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేలను కొనాల్సిన ఖర్మ వారికి పట్టలేదు. ఇప్పటికే రెండు స్థానాలు గెలిచింది. ప్రజస్వామ్యయుతంగానే వచ్చేసారి అధికారంలోకి రాగలదు. ఇదే విషయాన్ని అటు కిషన్ రెడ్డి మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలు చెబుతున్నారు. నాడు టీడీపీ కూడా ఇలానే బీజేపీపై బురదజల్లింది. చంద్రబాబు ఎగిరెగిరి పడి ఇప్పుడు అనుభవిస్తున్నారు.. కేసీఆర్ కు అదే గతి పడుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించడం విశేషం. మరి ఆరోజు వస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.