లేడీ సూపర్‌స్టార్‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌డమ్ సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ సాధించి.. అటు మెగాస్టార్ పైన.. ఇటు కేసీఆర్ పైన చాలాసార్లు విమర్శలు చేశారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆమె విలీనం చేశారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ‘హ్యాండ్’ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆమె కమలం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: దుబ్బాక లో బిజెపి వ్యూహం విజయవంతం?
కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతి కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది. కానీ.. ఆమె ఇప్పటివరకు ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపునివ్వలేదు. కానీ.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు ఇంటిపై సోదాలు, ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పోలీసుల వివాదంపై మాత్రం విజయశాంతి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
వీటిని చూస్తుంటే రాములమ్మ త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం నిజం అనే అనిపిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని విజయశాంతి నివాసానికి వెళ్లి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం.
Also Read: కొమురం భీమ్ వారసులకు ఈసారైనా ఊరట దక్కేనా?
విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయం కావడంతో ఇందుకు తేదీ కూడా నిర్ణయించినట్లు సమాచారం. నవంబర్ 10వ తేదీలోపు ఆమె పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీ పెద్దల సమక్షంలోనే విజయశాంతి కమలం గూటికి చేరనున్నారు. ఈ ప్రచారంపై మాత్రం విజయశాంతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.