Usha Rani: రాజకీయాలంటేనే పురుషాధిపత్యం.. ఒకరో ఇద్దరో తప్పితే జనాభాలో సగం ఉన్న మహిళా లోకం.. రాజకీయ పార్టీల్లో ఆ స్థాయిలో రాణించలేకపోతున్నారు. అయితే జాతీయ కాంగ్రెస్ ను నడిపించేదే ఒక మహిళ. కాంగ్రెస్ అందుకే మహిళా నేతల వాటా ఎక్కువ. ఇప్పటికీ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ. అందుకే చాలా మంది మహిళా నేతలు ఈ పార్టీలో ఎదిగేందుకు దోహదపడుతోంది. వారు పార్టీలో కీలక స్థానాలు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆయా కీలక రాష్ట్రాలకు ఇన్ చార్జీలను నియమించింది. ఆయా రాష్ట్రాల జనరల్ సెక్రటరీల పేరుతో బాధ్యతలు అప్పగించింది. ఇందులో మన ఆంధ్రాకు చెందిన ఆడబిడ్డ ‘గార ఉషా రాణి’కి అందలం దక్కింది. ఈమెను ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ కు ఇన్ చార్జీగా నియమించిన ఏఐసీసీ అత్యంత కీలక మైన రాష్ట్రాన్ని అప్పగించింది. దేశాన్ని పాలించే నేతల రాష్ట్రానికి మన తెలుగు బిడ్డను ఇన్ చార్జిగా పెట్టారంటే ఆమె శక్తి సామర్థ్యాలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

-ఎవరీ ఉషా రాణి
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్ఠణంలోని బాలాజీనగర్ కు చెందిన ఉషారాణి కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక సాధారణ పేద కుటుంబంలో గార శేషయ్య-శంకుతల దంపతులకు ఉషారాణి జన్మించారు. ఎన్నో అష్టకష్టాలు పడి కష్టపడి చదివారు. కష్టపడి క్రీడల్లో రాణించి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ లో సీటు సంపాదించి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. అక్కడే డిగ్రీ కంప్లీట్ చేశారు. కార్పొరేట్ లా చేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లాయర్ గా కొనసాగారు. ప్రస్తుతం అడ్వకేట్ గా రాణిస్తున్నారు. అండర్ 19 స్పోర్ట్స్ సెలక్షణ్ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. వీళ్ల నాన్నగారిది కూడా క్రీడా నేపథ్యమే.. అండర్19 స్పోర్ట్స్ క్రీడలు గుంటూరులో వీరి నాన్న గారి ఆధ్వర్యంలోనే జరిగేవి. అందులో ఉషా రాణిది అత్యంత కీలకమైన పాత్ర. ఇక ఉషారాణి కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులకు ఈమె శిక్షణ కూడా ఇచ్చారు. కళశాలలో చదివే రోజుల్లోనే ఈమె మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఆరుసార్లు నేషనల్ చాంపియన్ గా అవతరించింది. అప్పుడే ఎన్.ఎస్,యూ.ఐలో విద్యార్థి నాయకురాలిగా ఉషారాణి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

-విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి..
డిగ్రీ చదివే రోజుల్లో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఉషారాణి అనంతరం కళాశాల చదివే సమయంలోనే కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ అంటే ఆమెకు మొదటి నుంచి అభిమానం.. ఢిల్లీలో విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశారు. తర్వాత ఐఎన్ టీయూసీ నేషనల్ సెక్రటరీగా చేశారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాలకు ఇన్ చార్జిగా చేసి సోనియా, రాహుల్ అప్పగించిన పనులను తూ.చా. తప్పకుండా చేస్తారని.. సమర్థవంతమైన నాయకురాలిగా ఉషారాణి పేరు తెచ్చుకున్నారు.

-కాంగ్రెస్ లో కీలక శక్తిగా..
కాంగ్రెస్ అధిష్టానం ఏ పని అప్పగించినా శ్రద్ధతో, విజయవంతంగా పూర్తి చేసి పార్టీలో ఉషారాణి మంచి పేరు సంపాదించారు. అందుకే రాహుల్ గాంధీ టీంలో అత్యంత నమ్మకస్తురాలిగా ఉష పేరొందారు. యూత్ కాంగ్రెస్ లో అత్యంత కీలక సభ్యురాలిగా ఎదిగారు. అందుకే దేశంలోనే పవర్ ఫుల్ రాష్ట్రానికి తాజాగా ఇన్ చార్జిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ సెక్రటరీగా పదోన్నతిపై నియమించబడడం తెలుగు మహిళకు దక్కిన గౌరవంగా చెప్పొచ్చు.

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉష రాణి అంచెలంచెలుగా ఎదిగి.. కష్టపడి చదివి.. రాజకీయాలపై ఇష్టంతో చేరి.. అనంతరం పార్టీలో తన కృషి పట్టుదలతో బాగా పనిచేసి ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ఇన్ చార్జి స్థాయికి ఎదిగారు. ఓ చిన్న ఇంట్లో నుంచి వచ్చి ఇప్పుడు జాతీయ స్థాయి నేతగా రూపుదిద్దుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కీలక కేంద్రమంత్రిగానూ అవతరించడం ఖాయమంటున్నారు. రాజకీయాలంటే ఆమడదూరం జరిగే తెలుగింటి ఆడపడుచులకు ‘ఉషారాణి’ ఒక స్ఫూర్తి అనడంలో ఎలంటి సందేహం లేదు. ఆమె మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం..

