Phone Tapping: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలు తమ వ్యూహాలు మారుస్తున్నాయి. అధికార పార్టీ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఓ పక్క ఎస్పీ మరోవైపు కాంగ్రెస్, బీఎస్పీలు సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై పెదవి విరుస్తున్నాయి. రాష్ర్టంలో అరాచక పాలన సాగుతోందని విమర్శలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఓ ఆసక్తికర విమర్శ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కారు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రోజు సాయంత్రం తమ ఫోన్లు రికార్డింగ్ చేస్తూ వింటున్నారని చెబుతున్నారు. దీంతో కేంద్రం తమ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబడుతున్నారు. దీంతో బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార పార్టీ ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో విమర్శలకు దిగుతోంది. బీజేపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని వాపోతోంది. యోగి ఆదిత్య నాథ్ పాలనలో విఫలమయ్యారని విమర్శిస్తోంది. కేంద్ర నిఘా సంస్థలను ఉపయోగించుకుని అధికారాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం మీడియా పై విమర్శలకు దిగుతున్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారి మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని మోడీ పాలనలో ఏం చేయకున్నా ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి యూపీలో విమర్శ, ప్రతివిమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నాయి.
Also Read: PMO: వివాదంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్.. సంస్థల స్వయం ప్రతిపత్తికి తూట్లు..?