Punjab Elections: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఏళ్లుగా పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ స్థానికంగా నెలకొన్ని పరిణామాల నేపథ్యంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కీలక నేత ఒకరు ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భావోద్వేగ లేఖ రాశారు. ఆ నేత ఎవరంటే..

మాజీ ఎమ్మెల్యే జస్బీర్ సింగ్ ఖంగుర కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు. లేఖలో తాను రాజీనామా చేయడానికి గల కారణాలను, దారి తీసిన పరిస్థితులను వివరించాడు. కాంగ్రెస్ పార్టీ కోసం తన తండ్రి జగ్‌పాల్ సింగ్ ఖంగురా 60 ఏళ్లుగా, తాను 20 ఏళ్లుగా సేవలు చేశామని గుర్తుచేశారు. పార్టీ తరఫున ఇంత కాలం ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకుగాను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు గతంలో లాగా లేవని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.
పార్టీలో సేవ చేసేవారికి గుర్తింపు ఇవ్వడం లేదని మాజీ శాసన సభ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. అయితే, అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో నే జస్బీర్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

జస్బీర్ రాజీనామా వలన కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఈయన ఖిలా రాయ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, ఈసారి ఆయనకు ఆ అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా మరొకరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. దాంతో అసంతృప్తితో రగిలిపోయిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తన భవిష్యత్తు కార్యాచరణను మూడు రోజుల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. అయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ రాజీనామాలు చేస్తే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేననే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పంజాబ్‌లో ఆప్ అధినేత, దేశరాజధాని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలను విమర్శిస్తున్నారు. పంజాబ్ లో వచ్చే నెల 20 నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.