Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లో చేరికలు, వీడ్కోలులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విపక్ష కాంగ్రెస్, బీజేపీని వీడిన నేతలంతా బీఆర్‌ఎస్‌లోనే చేరుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ను వీడిన వారు కాంగ్రెస్ గూరికి వస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్‌ను వీడిన వారి గురించి మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడుతూ తాము వద్దనుకున్నవారే కాంగ్రెస్‌లో చేరుతున్నారని పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కాదన్నవారినే బీఆర్‌ఎస్ మంత్రులు కండువాలు కప్పుతున్నారు. పొన్నాల లక్ష్యమయ్య నుంచి విష్ణువర్ధన్‌రెడ్డి, తుల ఉమ వరకు వారి పార్టీల్లో టికెట్లు రానివారే. ఆయా పార్టీలు వద్దనుకున్న నేతలే. కానీ వారినే బీఆర్‌ఎస్ ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇక తాజాగా జాయిన్ అయిన తుల ఉమను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
చివరి నిమిషంలో టికెట్ నిరాకరణతో..
ఈటల రాజేందర్‌తో కలిసి తుల ఉమ బీజేపీ మూడేళ్ల క్రితం చేశారు. పార్టీ అప్పగించిన పనులు చేశారు. ఎన్నికల వేళ ఆమె వేములవాడ అసెంబ్లీ టికెట్ ఆశించారు. దీంతో ఈటల రాజేందర్ ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మూడో జాబితాలో తుల ఉమ పేరు వచ్చింది. దీంతో ఉమ ఈనెల 10న నామినేషన్ వేశారు. కానీ, చివరి నిమిషంలో బీఫాం మాత్రం మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు ఇచ్చింది అధిష్టానం. దీంతో తుల ఉమ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. రెబల్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు.
‘బండి’పై తీవ్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా, మరుసటి రోజు తుల ఉమను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు కలిశారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆలోచించి చెబుతానని ఉమ తెలిపారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ తీరుతోనే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. దొరలపై యుద్ధం చేస్తున్నాని చెప్పిన బండి సంజయ్ ఒక మహిళను, ఉద్యమకారిణి అయిన తన టికెట్ తన్నుకుపోయి దొరక కాళ్లకాడ పెట్టారని ఆరోపించారు. దొరా నీ బాంచెన్ అని మోకరిల్లారని పేర్కొన్నారు.
దొర గడీలోకి వెళ్లి..
మొన్నటి ప్రెస్‌మీట్ తుల ఉమ మాటలు చూసి అందరూ సానుభూతి చూపారు. పాపం నిజంగానే మోసం చేశారేమో అని భావించారు. కానీ, సోమవారం బీజేపీకి రాజీనామా చేసిన ఉమ, నేరుగా తెలంగాణ గడీలుగా భావిస్తున్న తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ముఖ్యమైన మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అప్పటి వరకు సానుభూతి చూపిన వారు ముక్కున వేలేసుకున్నారు. సంజయ్‌ను దొగ కాళ్లకాడ మోకరిల్లాడని మాట్లాడిన ఉమ మాటల్లో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ, ఉద్యమకారిణిని అని చెప్పుకున్న ఉమ మాత్రం మీడియా ముఖంగా దొర గడీలోకి వెళ్లి.. చిన్న దొర వద్ద మోకరిల్లారని బీజేపీ నాయకులు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. కేవలం ఓట్ల కోసమే తుల ఉమను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, ఎన్నికలయ్యాక ఆమె పట్టించుకునేవారే ఉండరని పేర్కొంటున్నారు.