TRS vs BJP: పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన ప్రసంగంపై రాజకీయ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ దీంతో అంటకాగుతూ రాజకీయ వేడి రగిలించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపింది. ఇంకా బీజేపీని ఇరుకున పెట్టేందుకు రాజ్యాంగం ప్రకారం ఏ అవకాశం ఉంటుందో అనే దానిపై ఆలోచనలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవాలని సకల ప్రయత్నాలు చేస్తోంది.
దీని కోసం ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని యోచిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారనే ఉద్దేశంతో న్యాయనిపుణుల సలహా మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ విభజన శాస్త్రీయంగా జరగలేదని చెప్పిన దానికి అది రాజ్యాంగ ఉల్లంఘన అని చంకలు గుద్దుకోవడం వారి తెలివి తక్కువ తనానికి నిదర్శనమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో నేతలు అన్ని విషయాలు లెక్కలోకి తీసుకోలేదని చెప్పడం గమనార్హం.
ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఈ వాతావరణం ఎక్కడి దాకా వెళ్తుందో తెలియడం లేదు. జాతీయ పార్టీతో పెట్టుకుని ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ సాధిస్తుందో అన్నదే ప్రశ్న. కానీ కేసీఆర్, కేటీఆర్ లు నోరు విప్పితే చాలు బీజేపీని చెడామడా తిట్టేయడం చేస్తున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: BJP vs TRS: మోడీ రాజ్యాంగం.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి తరువాత బీజేపీని టార్గెట్ చేసుకుని ధాన్యం కొనుగోలును సాకుగా చూపి ఇరుకున పెట్టాలని భావించినా అది నెరవేరలేదు. దీంతో అన్ని సమస్యలను పెద్దగా ఫోకస్ చేస్తూ బీజేపీని రాష్ట్రంలో నిలువరించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ టీఆర్ఎస్ పాచికలు మాత్ర పారడం లేదు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తే దాన్ని వక్రీకరించి తమ పబ్బం గడుపుకోవాలని చూడటం తెలిసిందే.
దీనిపై బీజేపీ కూడా సీరియస్ గానే తీసుకుంటోంది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీని బజారున పడేయాలని చూడటం విడ్డూరమే అయినా కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ తో పాటు అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇంకా ఎప్పుడు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీంతో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసుకోవడం అంటే కొండను పొట్టేలు ఢీకొన్నట్లుగానే ఉంటుంది. కొండను ఢీకొంటే పొట్టేలుకొమ్ములు విరుగుతాయి తప్ప కొండకు ఏం కాదనేది తెలుసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: BJP: ఉత్తరాంధ్రలో ఉద్యమానికి బీజేపీ సై.. జనసేన ఏమంటుందో..?