Tinmar Mallanna : తీన్మార్ మల్లన్న రాజకీయాలకు రాకముందు జర్నలిస్టుగా ఉన్నారు. వి6 ఛానల్ లో తీన్మార్ మల్లన్న కార్యక్రమం ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఆ ఛానల్ కు రాజీనామా చేసి సొంతంగా క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రశ్నించే గొంతుకగా ఆయన తనను తాను తెలంగాణ ప్రజలకు పరిచయం చేసుకున్నారు. క్యూ న్యూస్ ద్వారా గత భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో జరిగిన తప్పులను ఆయన ఎత్తిచూపారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. దీంతో ఆయన గత ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చారు. అయితే సమయంలో నాడు ఆయనకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అండగా నిలిచారు. జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. కానీ కొంతకాలానికే అందులో నుంచి బయటికి వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.. కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించడంలో మల్లన్న విజయవంతమయ్యారు.
చేసిన సేవలు గుర్తించి..
మల్లన్న చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనను అభ్యర్థిగా నిలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో మల్లన్న ఎమ్మెల్సీగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పై పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. జనగామ నుంచి రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయడంతో.. ఎమ్మెల్సీ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆస్థానంలో నిలబడి.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డి మీద గెలిచారు. అయితే కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించిన కుల గణనపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల బీసీ గర్జనలో ఓ సామాజిక వర్గంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారగా.. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ వేదికగా భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది ప్రభుత్వానికి తలవంపుగా మారింది. దీంతో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ఆ నోటీసుకు పెద్దగా స్పందించలేదని సమాచారం. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. కుల గణనపై సొంత పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఇది జరిగి రోజులు గడిచేయో లేదో .. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే మల్లన్న పై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడం విశేషం. మరి ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న తన రాజకీయ భవిష్యత్తును ఎలా నిర్ణయించుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఇటీవల తన సామాజిక వర్గం నేతలతో కలిసి తీన్మార్ మల్లన్న సమావేశం నిర్వహించారు. అందులో కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పార్టీ ఆయనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. ఏ పార్టీలోకి వెళ్తారనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన తీన్మార్ మల్లన్న.. ఇలాంటి డైలాగులు ఎప్పుడూ చూడలేదు