Tinmar Mallanna : “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తిరుగుబాటు చేశారా? బీసీ కులాల వారిని రేవంత్ చిన్న చూపు చూస్తున్నారా? గతంలో తీన్మార్ మల్లన్న చేసిన విజ్ఞప్తులను ఆయన బుట్ట దాఖలు చేశారా? అందువల్లే తీన్మార్ మల్లన్న లో ఆగ్రహం కట్టలు తెంచుకుందా? త్వరలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు స్వయంగా ఔను అనే సమాధానం చెబుతున్నారు తీన్మార్ మల్లన్న. హైదరాబాదులో మంగళవారం హోటల్ తాజ్ కృష్ణ లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఇదే సమావేశానికి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య వంటి వారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మీడియాలో ప్రముఖంగా రావడంతో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి త్వరలో అమెరికా పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఆ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. ఎన్నికలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థి అనుగుల రాకేశ్ రెడ్డి పై విజయం సాధించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పలుమార్లు ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఆ మధ్య ప్రభుత్వం అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులను భర్తీ చేసింది. ఆ పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చింది. అయితే ఆ పదవులను బీసీ కులాల వారితో భర్తీ చేయాలని తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారట. అయితే ఆ విజ్ఞప్తిని రేవంత్ రెడ్డి తోసిపుచ్చారట. బిసి కులాలకు ఆ పదవులు ఇచ్చేంత ఆసక్తి తనకు లేదని రేవంత్ చెప్పారట. అదే విషయాన్ని బీసీ కులాల సమావేశంలో తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. “ఇదెక్కడ అన్యాయం.. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టులను బీసీ కులాలతో భర్తీ చేయాలని కోరితే పట్టించుకోలేదు. ఇలాంటి విధానం సరికాదు. నేను రేవంత్ రెడ్డికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. బీసీ కులాల అభ్యున్నతే నా లక్ష్యమని” తీన్మార్ మల్లన్న ప్రకటించారు. బీసీల కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మల్లన్న అన్నారు. బీసీలను విస్మరిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
అధికారాన్ని చేజిక్కించుకోవాలి
ఇక ఈ సమావేశానికి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి హాజరయ్యారు.. బీసీ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాయని.. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు ఇన్నాళ్లకు బీసీ కులాలు గుర్తొచ్చాయని.. బీసీ కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలా గణన చేపట్టిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని.. దేశ జనాభాలో 70 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సింహ భాగం దక్కాలని వారు కోరారు.
ప్రాధాన్యం సంతరించుకుంది
తీన్మార్ మల్లన్న ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.”తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత విద్యాశాఖ మంత్రి అడిగారు. అయితే దానికి రేవంత నో చెప్పారు. అందువల్లే తీన్మార్ మల్లన్న యూటర్న్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. అయితే ఇలాంటి బెదిరింపులకు రేవంత్ రెడ్డి భయపడరు. ఇలాంటి వాళ్లను ఆయన రాజకీయ జీవితంలో ఎంతో మందిని చూశారు. బీసీల అభ్యున్నతి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చేస్తోంది. ఆ విషయం తెలియకుండా మల్లన్న ఏదేదో మాట్లాడారు. ఆ విషయం ఆయన వ్యక్తిగతం. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని” హస్తం పార్టీ నాయకులు సామాజిక మాధ్యమ వేదికలలో వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టుల్లో బీసీలకు అవకాశం ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిప్రజెంటేషన్ ఇస్తే నాకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకి పదవులు ఇచ్చే సోయి కానీ, ఆలోచన కానీ, లేదు – కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్… pic.twitter.com/JLpd7lhfp1
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024