Tinmar Mallanna : ప్రశ్నించే గొంతుకగా తెలంగాణలో తీన్మార్ మల్లన్నకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై మల్లన్న దాదాపుగా ఒంటరిపోరు సాగించారు. మల్లన్న పోలీస్ నిర్బంధాన్ని, జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మల్లన్న, ఆయన మీడియా సహకారం లభించింది. ఆ తర్వాత నల్గొండ-ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రావడంతో సీయం రేవంత్ మద్దతుతో మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదే స్థానంలో మల్లన్న 2017 లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఓడిపోగా, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ద్వితీయ స్థానంలో నిలిచి, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చారు. పల్లా ఎమ్మెల్యే గా గెలవడంతో ఆయన రాజీనామా చేయగా 2024లో జూన్లో ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కినప్పటికీ మల్లన్న ఈ ఎన్నికలో ఒంటరి పోరాటమే చేశారు. ప్రధానంగా ఈ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వాళ్ళు ఎవరూ మల్లన్నకి మనస్ఫూర్తిగా సహకరించలేదు. నామమాత్రంగా ఒకటో, రెండో సదస్సులు పెట్టి మమ అనిపించారే తప్ప పోల్ మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. విషయాన్ని ఎప్పటికప్పుడు గ్రహించిన మల్లన్న మెడలో కాంగ్రెస్ కండువా వేసుకున్నప్పటకీ, తన సొంత టీమ్ ద్వారానే ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ చేసుకొని గెలుపొందారు. ఈ ఆవేదనంతా మల్లన్న మనసులో గూడుకట్టుకొని ఇటీవల అక్కడక్కడా బయట పడుతోంది.
■ రెడ్డీల ఓట్లు వద్దే వద్దని కుండ బద్దలు కొట్టిన మల్లన్న:
తాజాగా బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో మల్లన్న రెడ్డి నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకి సహయనిరాకరణ చేసిన అంశంపై తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీ చేసినా తనకు రెడ్డి సామాజికవర్గం, ఓసీ కులాల ఓట్లు వేయవద్దని చెప్పారు. తనకి బీసీల ఓట్లు చాలని కుండబద్దలు కొట్టారు. రాష్ర్రంలో బీసీల ఐక్యత అత్యవశ్యకమని అంతా కలిసి ధీటుగా పార్టీ పెట్టి రాష్ర్రంలో రాజ్యాధికారం సాధించాలని మల్లన్న ఆకాంక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ గా గెలిచాక కూడా రెడ్డి కుల మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లన్నతో కలివిడిగా ఉండడం లేదని, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఇక చాలు అన్నట్లుగానే సీయం వైఖరి కూడా కనిపిస్తోందని మల్లన్న అనుయాయులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లన్న నాయకత్వంలోనే బీసీ పార్టీ ఏర్పాటు కావాలనే అభిప్రాయాలు వెళ్లాడవుతున్నాయి.