East Godavari: గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటాయి. గోదావరి పరవళ్లు, గోదావరి రుచులు, యాస, అక్కడి ప్రజల మమకారం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంతా లిస్టు అవుద్ది. సినిమాలు, నాటకాలు, వ్యవ‘సాయ’మంటే ప్రాణం ఇచ్చే గోదావరివాసులు రాజకీయంగానూ ఎల్లప్పుడూ తమదైన ప్రత్యేకతను చాటుకోవడంలో ముందుంటారు.
ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. ‘తూర్పు’కు చెందిన వీరిద్దరు కూడా భిన్న ధృవాలుగా వ్యవహరిస్తుండటంతో అందరిచూపు వీరిపైనే నెలకొంది.
ఆ ఇద్దరు నేతలెవరో కూడా ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. వారిలో ఒకరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాగా మరొకరు కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. వీరిద్దరు కూడా తరుచూ రాష్ట్రంలోని పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అయితే వీరివురు కూడా భిన్నంగా స్పందిస్తుండటంతో ఎవరి మాటలు నమ్మాలి? ఎవరు కరెక్ట్ అని ప్రజలు ఆలోచనలో పడుతున్నారు.
మాజీ ఎంపీ ఉండవల్లి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సీఎం జగన్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతుంటారు. ఏం మాట్లాడినా పూర్తిగా అధ్యాయనం చేసిన తర్వాత మాట్లాడుతారనే పేరు ఉండవల్లికి ఉంది. అంతేకాకుండా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తెప్పించుకొని అందుకు తగ్గట్టుగానే మాట్లాడుతుంటారు. దీంతో ఆయన వాదన కరెక్ట్ అని మెజార్టీ ప్రజలు నమ్ముతుంటారు.
కాగా ఉండవల్లి వ్యాఖ్యలు జగన్ సర్కారును ఇబ్బంది పట్టేలా ఉంటుండటంతో ఆయన చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతారనే ప్రచారం ఉంది. ఎవరు ఎలా అనుకున్నా ఉండవల్లి మాత్రం రాజకీయంగా ముక్కుసూటిగా మాట్లాడుతారనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం విషయానికిస్తే.. ఆయన పూర్తిగా కాపు నేతగానే గుర్తింపు తెచ్చకున్నారు.
Also Read: పొగడ్తల ‘వరద’.. సాయం అందేనా మరీ?
ఏపీలోని కాపులందరినీ ప్రభావం చేయగల నేత ముద్రగడ పద్మనాభం. చంద్రబాబు హయాంలో కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేశారు. ఆయన ఉద్యమం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడంతో నాటి ప్రభుత్వం ఆ పోరాటాన్ని ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయారు.
చంద్రబాబు వల్ల కాపులకు ఒరిగేది ఏమిలేదని ఆయన అభిప్రాయం. దీంతోనే ఆయన జగన్ సర్కారుకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. జగన్ కాపులకు ఏం చేయకపోయినా చంద్రబాబు కంటే జగన్ బెటరనే అభిప్రాయంలో ముద్రగడ ఉన్నారు. మొత్తానికి తూర్పు గోదావరికి చెందిన ఈ ఇద్దరు నేతలు పరోక్షంగా అధికార, ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది.