Road Accidents: గోల్డెన్ అవర్.. రోడ్డు ప్రమాద బాధితులను రక్షించడానికి ఈ గంట చాలా కీలకం. సైబర్ మోసాల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు ఉపయోగించే ఈ గోల్డెన్ అవర్‌ను ఇప్పుడు యాక్సిడెంట్స్(Accidents)లో గాయపడినవారిని కాపాడేందుకు వాడుతున్నారు. గంటలోపు క్షతగాత్రులకు చికిత్స అందితే వారి ప్రాణాలు నిలబడతాయి. పునర్జన్మ లభిస్తుంది. అయితే.. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడం చాలా కష్టం. ఇందుకోసం ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్ సర్వీస్‌లు ఏర్పాటు చేసినా.. వివిధ కారణాలతో సమయానికి ఘటనా స్థలికి చేరడం లేదు. దీంతో చాలా మంది నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి జంకుతున్నారు. ఏదైనా జరిగితే తమకు చుట్టుకుంటుందేమో… పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అన్న భయంతో చాలా మంది గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించడానికి వెనుకాడుతున్నారు.
ఏ సమస్య అయినా..
గోల్డెన్ అవర్ అనేది కేవలం యాక్సిడంట్స్‌లో గాయపడిన వారికే కాదు.. మన జీవన శైలిలో మార్పుతో వచ్చే అనారోగ్య సమస్యలు, హార్ట్ స్ట్రోక్స్‌కు కూడా వర్తిస్తుంది. వీరిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రి తరలిస్తే.. ప్రాణాలు నిలబడతాయి. అందుకే గోల్డెన్ అవర్‌ను యాక్సిడెంట్స్‌తోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించే అందరికీ వర్తిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం క్షతగాత్రులను నిర్భయంగా ఆస్పత్రులకు తరలించేలా కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇకపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను ఎలాంటి సంకోచం లేకుండా ఆస్పత్రుల్లో చేరిపంచవచ్చు.
రూ.25 వేలసాయం..
ప్రాణాపాయ స్థితిలో ఎవరైనా ఆస్పత్రికి తీసుకెళ్లిన ఈ సందర్భాల్లో చికిత్స అందించేందుకు ఎలాంటి పోలీస్ కేసు ముందుగా నమోదు చేయాల్సిన రూల్ లేదని కేంద్రం ఇప్పటికే తెలిపింది. రోడ్డు ప్రమాదాల్లో స్పందించి సాయం చేసే వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదన్న నిబంధనలు తెచ్చింది. ఏదైనా సందేహం ఉంటే అదికూడా అవసరం లేదని తాజాగా గోల్డెన్ అవర్ విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం.. రోడ్డ ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే వారికి రూ.25 వేల రివార్డు కేంద్రం అందిస్తుంది. నిజానికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మానవత్వంతో స్పందించి, సేవా దృక్పథంతో ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చే వారిని గుడ్ సమరిటన్స్(ఉత్తమ పౌరులు)గా గుర్తించి రూ.5 వేల రివార్డు అందించే విధానం కేంద్రం ఇదివరకే ప్రవేశపెట్టింది. ఈ రివార్డును కేంద్రం ఇప్పుడు రూ.25 వేలకు పెంచింది.
ఇక సందేహించకుండా మీలోని మానవత్వాన్ని నిద్రలేపండి.. ఆసదలో ఉన్నవారికి మీకు చేతనైన సాయం చేయండి. ఉత్తమ పౌరులుగా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి వారికి ప్రాణదాతలు కండి.. రూ.25 వేల రివార్డు తీసుకోండి. అయితే రివార్డు కన్నా.. మీ కారణంగా ఓ ప్రాణం నిలబడిందన్న సంతృప్తి మీకు చాలా బాగా అనిపిస్తుంది.