Electric Meters Agricultural Pump Sets: వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు విషయంలో వైసీపీ సర్కారు వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది కూడా. మిగతా జిల్లాకు విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. విపక్షాల నుంచి, రైతు సంఘాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుకెళ్లాలని యోచించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు అవసరం లేదని.. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటరు పడితే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్ మీటర్లు పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు రావడానికి అనేక కారణాలున్నాయి. పైకి మాత్రం నాణ్యమైన విద్యుత్ అందించడానికని.. రైతులు ఎంత వినియోగిస్తారో తెలుసుకోవడానికంటూ ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది. కానీ కేంద్ర ప్రతిపాదించే సంస్కరణలు అమలుచేస్తే భారీగా అప్పు తీసుకోవడానికే అన్నది వాస్తవం. కానీ దానిని మరుగునపెట్టి ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతూ వచ్చింది. అటు రైతుల నుంచి ఎక్కడికక్కడే ప్రతిఘటనలు ఎదురైనా పెడచెవిన పెట్టింది. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో వ్యతిరేకిస్తూ వచ్చింది. మీటర్లు బిగించితే.. రైతు మెడకు ఉరి వేసినట్టేనని అభివర్ణించింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలు పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రమే వెనక్కి తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకడుగు వేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు తిరిగి విద్యుత్ మీటర్లు తీసేస్తే..విపక్షాల చేతికి బలమైన ఆయుధం ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్ మానసపుత్రికగా..
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కు ఆద్యుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తొలిఫైల్ గా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఉచిత విద్యుత్ నిరాటంకంగా కొనసాగుతోంది. ఉచిత విద్యుత్ విధానాన్ని టచ్ చేసేందుకు కూడా ఏ ప్రభుత్వం సాహసించలేదు. ఉచిత విద్యుత్ విధానాన్ని సంస్కరించే ప్రయత్నాలు జరిగినా.. రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గిన సందర్భాలున్నాయి.
Also Read: Kishan Reddy- Pawan Kalyan: కిషన్ రెడ్డి పిలిచినా పవన్ వెళ్లలేదా? కారణమేంటి?
అటువంటిది ఆయన కుమారుడు ఉచిత విద్యుత్ ను నిలిపివేయాలని ప్రయత్నించడం విమర్శలు చుట్టుముట్టాయి. వాస్తవానికి విద్యుత్ మీటర్ల ప్రతిపాదనను బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకించాయి. కానీ జగన్ సర్కారుకు తప్పనిసరి పరిస్థితి. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్ర భవిష్యత్ ఆదాయాన్ని కుదువ పెట్టి మరీ అప్పులు చేస్తున్నారు. అందుకే విద్యుత్ సంస్కరణల వల్ల వేలాది కోట్ల రూపాయలు అప్పు దొరుకుతుందని జగన్ భావించారు. అందుకే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైనా, విపక్షాలు విమర్శలు చేసినా పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలని నిర్ణయించారు. అయితే తానొకటి తలిస్తే బీజేపీ నాయకత్వం ఒకటి తలచింది. పంపుసెట్లకు మీటర్లు వద్దని.. ట్రాన్ష్ ఫార్మర్లకు పెడితే సరిపోతుందని సరిపుచ్చడంతో ఏపీ సర్కారు డిఫెన్స్ లో పడిపోయింది.
విపక్షాలకు ఆయుధం..
రైతులు మీటర్లు పెట్టుకుంటే బిల్లులను నగదు బదిలీలో చెల్లిస్తామని సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివ్రుద్ధి పనులకే చెల్లింపులు చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. అటువంటిది మాకు నగదు బదిలీ చేస్తామంటే నమ్మమంటారా? అంటూ రైతులు ప్రశ్నించారు. దీనిపై ఒకరకంగా అప నమ్మకం పెట్టుకున్నారు. అటు విపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు సైతం నిరసనలకు దిగారు. కానీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మోదీ సర్కారు దీనిపై వెనక్కి తగ్గింది. దీనిపై ప్రత్యేక సవరణ చేసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే కేంద్ర తాజా నిర్ణయంతో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ సర్కారే ఎక్కువగా బాధపడుతోంది. అటు రైతులు, విపక్షాల వద్ద చులకన కాగా.. సంస్కరణలతో అప్పు తెచ్చుకోవాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. సో ఏపీ సర్కారు గట్టి ఎదురు దెబ్బనే చూపించింది కేంద్ర ప్రభుత్వం.