https://oktelugu.com/

TDP: తెలుగుదేశానికి తెలంగాణ పరీక్ష

1983 నుంచి 1999 వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దే పై చేయి. 2004 తర్వాత మాత్రం సీన్ మారింది. కానీ అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 55 స్థానాలకు మించి ఎప్పుడు గెలుపొందలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 29, 2023 / 10:24 AM IST

    TDP

    Follow us on

    TDP: తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పైకి ఎవరికీ మద్దతు తెలపకున్నా లోపాయి కారీగా మాత్రం బలమైన ఆకాంక్షతో ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక విప్లవం సృష్టించింది. టిడిపి ఆవిర్భావం తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ కొట్టింది. బీసీ నాయకత్వాన్ని తయారుచేసి కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి కొట్టింది. అటువంటి పార్టీ ఇప్పుడు పోటీలో లేకపోవడం విశేషం.

    1983 నుంచి 1999 వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దే పై చేయి. 2004 తర్వాత మాత్రం సీన్ మారింది. కానీ అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 55 స్థానాలకు మించి ఎప్పుడు గెలుపొందలేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో సైతం హస్తం పార్టీకి తెలంగాణ చిక్కలేదు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడమే. అటువంటి తెలుగుదేశం పార్టీ 2004, 2009 కొంతవరకు ఉనికి చాటుకున్నా.. 2014 తర్వాత మాత్రం పెద్దగా ఉనికి చాటుకోలేకపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాస్త బెటర్ ఫలితాలను సాధించింది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా డీలా పడిపోయింది. ఈ ఎన్నికల్లో మాత్రం కనీసం పోటీలో లేకుండా పోయింది.

    మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి భావించింది. మిగతా రాజకీయ పక్షాలకు మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో టిడిపి క్యాడర్ అయోమయ స్థితిలోకి వెళ్ళింది. కానీ వారికి పరోక్షంగా సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిడిపి క్యాడర్, ఓ బలమైన సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. ఆ పార్టీకే బాహటంగా మద్దతు తెలుపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని బలంగా విశ్వసిస్తోంది. అందుకే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.కానీ ఎక్కడ నాయకత్వం మాత్రం బయటపడడం లేదు.అన్ని పార్టీలు టిడిపి క్యాడర్ను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయడం విశేషం.

    ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా కేసిఆర్ కు తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని కేసీఆర్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే 2019 ఏపీ ఎన్నికల్లో జగన్కు అన్ని విధాలా సహకారం అందించారు. జగన్ అధికారంలోకి రాగలిగారు. అప్పటినుంచి అదును కోసం చంద్రబాబు వేచి చూస్తున్నారు. ఇన్నాళ్లకు తెలంగాణ ఎన్నికల రూపంలో అవకాశం లభించడంతో.. కెసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందడం ద్వారా కెసిఆర్ కు సరైన గుణపాఠం చెప్పవచ్చని టిడిపి క్యాడర్ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తోంది. ఏ పార్టీకి వ్యతిరేకంగా టిడిపి పురుడు పోసుకుందో.. అదే పార్టీకి మద్దతు తెలపాల్సిన అనివార్య పరిస్థితి ఎదురు కావడం విశేషం. అందుకే అంటారు రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని…