CM KCR: పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని దెప్పి పొడిచే కేసీఆర్.. తన నిర్లక్ష్యాన్ని మాత్రం ఒప్పుకోడు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, సమగ్ర శిక్షణ.. ఇంకా బొచ్చెడు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ₹వేల కోట్లను కోల్పోతోంది. ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులకు పరిహారం వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పోనీ రాష్ట్ర ప్రభుత్వమన్నా కొత్త పథకాలు తీసుకొచ్చిందా అంటే అది కూడా లేదు.

ఎందుకు ఈ నిర్లక్ష్యం
సమకాలిన రాజకీయాలలో కేసీఆర్ ఓ టిపికల్ క్యారెక్టర్. తాను ఏది అనుకుంటే అది చేసే రకం. పేరుకు రాష్ట్ర ప్రయోజనాలు అంటూ చెపుతారు కానీ అందులో స్వ ప్రయోజనాలు ఉంటేనే అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన ప్రతి పథకం కూడా లో భూష్టంగానే ఉంటుంది. ఓ ధరణి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, దళిత బంధు, కాలేశ్వరం.. ఇలా చేపట్టిన ప్రతి పనిలోనూ ఎన్నో లోసుగులు. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. అది అభివృద్ధికి విఘాతం కలిగిస్తోంది. పైగా ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోయడం కేసీఆర్ కు ఈ మధ్య పరిపాటిగా మారింది. కేసీఆర్ బాటలోనే మిగతా మంత్రులు నడుస్తుండటంతో వాస్తవ విషయాలు మరుగున పడుతున్నాయి.
Also Read: Monkeypox: బీ అలెర్ట్.. కరోనా పోయింది.. దేశంపైకి మరో కొత్త వైరస్ వచ్చింది
రాష్ట్రం స్పందించి ఉంటే బాగుండేది
దేశీయ విద్యా విధానంలో సమూల మార్పులు జరగాలని కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షణ అనే పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలల అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను తన వాటాగా 60 శాతం, రాష్ట్రాల వాటా 40% ఇవ్వాలని ప్రతిపాదించింది. చేపట్టబోయే పనుల వివరాలను కూడా తనకు డిపిఆర్ ఇవ్వాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. కానీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. పైగా మన ఊరు మనబడి పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించి డప్పాలు కొట్టింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎనిమిదేళ్లలో కేంద్రం ఇచ్చిన ₹9,456 కోట్లను రాష్ట్రం వాటా ఇవ్వకుండా మురగబెట్టింది. పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి లేఖ రాసినా ఫలితం లేకుండా పోయింది. దీనివల్ల ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి.

మన ఊరు మనబడి కూడా లోపభూయిష్టమే
కేంద్రం పథకం అమలు చేయడానికి చేతులు రాని కేసీఆర్.. మన ఊరి మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో పాఠశాలలను బాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ కాంట్రాక్టు మొత్తం ఓ బడా కంపెనీకి ఇచ్చారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసే సామగ్రిని స్థానిక కంపెనీలకు ఇవ్వాల్సింది పోయి కార్పోరేట్ కంపెనీలకు తలొగ్గారు. ఇందుకు తగ్గట్టుగానే రాత్రికి రాత్రి జీవోలు మార్చారు. దీనిపై చిన్న పరిశ్రమల యజమానులు హైకోర్టుకు వెళ్లారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన కోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పాఠశాల అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాయవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ప్రభుత్వం విద్యను కూడా వ్యాపారంగా మార్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలు నేపథ్యంలో ప్రభుత్వం పీచేముడ్ అయింది. మన ఊరు మనబడి కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేసింది. గతంలో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు కెసిఆర్ ఒకసారి వద్దని, మరోసారి కావాలని రెండు నాలుకల మాటలు మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ విషయంలోనూ ద్వంద్వవైఖరి అవలంబించారు. అధికారం ఇవాళ ఉంటుంది. రేపు పోతుంది. అది మోడీ కైనా, కేసీఆర్ కైనా ఒకే విధంగా వర్తిస్తుంది. కానీ ఓటు వేసే ప్రజలు శాశ్వతం. వారి కోసం చేపట్టే అభివృద్ధి శాశ్వతం. కానీ రాజకీయ కక్ష సాధింపులకు పోతే అంతిమంగా ఇబ్బంది పడేది ఓటు వేసిన ప్రజలే. ఈ విషయం 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు అర్థం కాకపోవడం బాధాకరం.