
తెలంగాణతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలు అధికారం కోల్పోవడంతో ఢీలా పడిపోయింది. నాయకులతోపాటు శ్రేణుల్లోనూ నిరుత్సాహం అలుముకుంది. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడిన కాంగ్రెస్ మళ్లీ తన పవర్ చూపించాలని భావిస్తోంది. దీనిలో భాగంగానే అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో మార్పులు.. చేర్పులకు శ్రీకారం చుడుతోంది. దీంతో తెలంగాణ నేతలు అలర్ట్ అవుతున్నారు. త్వరలోనే పీసీసీ మార్పు.. ఇతర పదవుల పంపకం ఉండటంతో నేతలు ఉత్సాహంగా పని చేస్తున్నారు.
Also Read: కేసీఆర్ ఇప్పుడు చెప్పు.. కేంద్రం ఇచ్చిన లెక్క ఇదీ?
ఎవరికీ వారే.. యమున తీరే అన్న చందంగా ఉండే కాంగ్రెస్ నేతలు ఇటీవల పద్ధతిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి జట్టుగా వెళుతున్నారు. అధిష్టానం ఎవరికీ కేటాయించిన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. నేతల మధ్య విబేధాలుంటే ఇతర నేతలు కలుగజేసుకొని నచ్చజెబుతుండటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కన్పిస్తుంది. నేతల కమ్ములాటలే కాంగ్రెస్ పార్టీని దెబ్బతిస్తున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నేతలు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్లంతా బాధ్యతగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఇటీవల ఆస్పత్రుల సందర్శన పేరుతో రాష్ట్రమంతటా తిరిగారు. అదేవిధంగా రేవంత్ రె్డ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి.. అక్రమాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే కార్యక్రమాలను చేపడుతూ ముందుకెళుతున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని నేతలంతా ప్రత్యేక కార్యచరణలో ముందుకెళుతూ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు దుబ్బాక ఉప ఎన్నిక రానున్నాయి. దీంతో పార్టీ నేతలంతా ఈ ఎన్నిలకు సమయాత్తం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నారు. ప్రధానంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. రెండు మూడ్రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పని చేసేందుకు రెడీ అవుతున్నారు.