Homeజాతీయ వార్తలుTelangana Assembly Elections 2023: ఎన్నికల తెలంగాణ.. పార్టీల బలాలు.. బలహీనతలు ఏంటి?

Telangana Assembly Elections 2023: ఎన్నికల తెలంగాణ.. పార్టీల బలాలు.. బలహీనతలు ఏంటి?

Telangana Assembly Elections 2023: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగేవి మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. 2014, 2018లో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించింది. ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని సీఎం కేసీఆర్‌ పట్టుదలతో ఉన్నారు. ఇక కర్ణాటక విజయం సాధించిన కాంగ్రెస్‌.. తెలంగాణలోనూ అదే ఫార్ములాతో గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కమలం పార్టీ బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేసేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మరి తెలంగాణలో ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారు. మూడు పార్టీల బలాబలాలు.. టు షేర్‌ వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.

2014లో ఇలా..
2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్, అప్పటి టీఆర్‌ఎస్‌ 119 స్థానలకుగాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్‌. అప్పుడు కూడా 119 స్థానలకుగాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. ఎంఐఎం ఏడు, ఇండిపెండెంట్లు రెండు, బీజేపీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.

ఓటింగ్‌ శాతంలా..
2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 46.87శాతం ఓట్లును సాధించింది. కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చినా 28.43శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచినాం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత? గెలిచేదెవరు..? అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్‌ఎస్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతుందా? కాంగ్రెస్‌ కర్నాటక ఫార్ములా తెలంగాణలో వర్కౌట్‌ అవుతుందా..? బీజేపీ తెలంగాణ పాగా వేయగలుగుతుందా?.. ఇదేది అందరిలో ఉన్న ప్రశ్న.

మూడు పార్టీల మధ్యే పోటీ..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ తొలిజాబితాలో 55 టిక్కెట్లు ఖరారు చేసింది. బీజేపీలు ఇంకా అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. మరోవైపు కొన్ని నెలలుగా తెలంగాణలో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీని దాటి కాంగ్రెస్‌ రెండో స్థానంలో వచ్చేసినట్టు పలు సర్వేలు కూడా సూచిస్తున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో గెలుపెవరిది అన్నది.. ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకున్నాం ఈసారి స్పష్టమైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌ మ్యాజిక్‌ ముందు నిలబడలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీజేపీ గ్రాఫ్‌ పెరగడం కూడా అంత సులువు కాదన్న చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఈసారి అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్నది ఉత్కంఠగా మారింది.

ముందు వరుసలో కేసీఆర్‌..
ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కంటే సీఎం కేసీఆర్‌ ఎన్నికల క్షేత్రంలో ముందే ఉన్నారు. పార్టీ అభ్యర్దులను ముందుగానే ఖరారు చేసేశారు. 119 స్థానాలకు, 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. టికెట్లు రాని అసంతృప్తుల్లో కొందరు పార్టీలు మారిపోగాం మరికొందరిని అధిష్టానం బుజ్జగించింది. దీంతో పార్టీ టికెట్ల లొల్లి దాదాపుగా ఒక కొలిక్కివచ్చింది. మరోవైపు ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌ ముందే ఉంది. సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతతో ప్రజలకు కాస్త దూరంగా ఉన్నా.. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రచారంలో దుమ్మురేపారు. తాజాగా కేసీఆర్‌ కూడా రంగంలోకి దిగారు. హుస్నాబాద్‌ నుంచి సమరశంఖం పూరించారు.

గ్యారెంటీ స్కీంలపై కాంగ్రెస్‌ ఆశలు..
ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ.. ఇంకా అభ్యర్థుల కసరత్తులోనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఇప్పటికే గ్యారెంటీ స్కీంలు ప్రకటించింది. ఆ గ్యారెంటీ స్కీములపైనే ఆశలు పెట్టుకుంది. అయితే సీఎం కేసీఆర్‌.. దీనికి కూడా కౌంటర్‌ ఇచ్చారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న అందరికీ బీమా వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. దీంతో 93 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో పెన్షనర్లు, రైతులనే కేసీఆర్‌ ఎక్కువగా నమ్ముకున్నారు. దీంతో ఈసారి మేనిఫెస్టోలో పెన్షనర్లు, మహిళలు, రైతులకే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంశాన్ని విస్మరించారు.

యువతే కీలకం..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం ఏడు లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగాం 35 ఏళ్లలోపు ఓటర్లు 30 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు యువతపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. యువతను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని 3.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఏడు లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వారే. అలాగే, 75 లక్షల మంది ఓటర్లు 19 నుంచి 35 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. యువత నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లు ఎలాగూ బీఆర్‌ఎస్‌కు పడవని కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారు. కానీ ఈసారి ఎన్నికలను యువత, నిరుద్యోగులు, ఉద్యోగులే ప్రభావితం చేస్తారన్న విశ్లేషణలు వస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular