
అవసరాలు వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా.. భూములను అమ్మడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. బిల్డ్ ఏపీ పేరిట విశాఖ, తదితర ప్రాంతాల్లో భూములు అమ్మడానికి ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు వంతు. ఏకంగా 20 వేల ఎకరాలను అమ్మడానికి సిద్ధపడుతోందని వార్తలు వస్తున్నాయి. మరి, ఇప్పుడు ఉన్నాయి కదా అని భూములు తెగనమ్ముకుంటే.. రేపు దేన్ని నమ్ముకుంటారు? భవిష్యత్ అవసరాల సంగతేంటీ? అన్నది ప్రశ్న.
భూమి అనేది పెరుగుదల లేని వనరు. బతకడానికి అవసరమైన తిండి గింజలు పండించుకోవడం నుంచి.. ఉపాధి కల్పించే ఫ్యాక్టరీల వరకు.. అవసరాలు తీర్చే సంస్థల వరకు ఏది ఏర్పాటు చేయాలన్నా భూమ్మీదనే చేయాలి. అంత విలువైన భూములను.. తాత్కాలిక అవసరాల కోసం సర్కారు అమ్మేసుకోవడం భవిష్యత్ తరాలకు ఖచ్చితంగా దెబ్బే.
ఏపీతో పోల్చినప్పుడు తెలంగాణలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉంది. ఇది ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వరం. రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల మొదలు.. అన్ని జిల్లాల్లోనూ సర్కారు భూమి ఉంది. భవిష్యత్ లో ఫ్యాక్టరీలు, సంస్థలు రావాలంటే.. సర్కారు భూములు చూపించాల్సి ఉంటుంది. భూములతోపాటు తగిన రాయితీలు వచ్చినప్పుడే ఆయా సంస్థలు ముందుకు వస్తాయి. దాని ద్వారా.. స్థానికులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. వాటిపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇదంతా అభివృద్ధి చక్రంలో భాగం.
మరి, ఇలా అవసరం వచ్చినప్పుడల్లా భూములు అమ్మేసుకొని ఇవాళ కడుపు నింపుకుంటే.. రేపటి సంగతేంటీ? ఇవాళ అమ్మేసుకొని.. అవసరమైనప్పుడు ప్రజల నుంచి సేకరించవచ్చు అని ప్రభుత్వాలు అనుకుంటున్నాయా? అనేది సందేహం. ఇదే నిజమైతే.. దానివల్ల ప్రజలతోపాటు ప్రభుత్వంపైనా పెను ప్రభావం పడుతుంది. ఇవాళ వెయ్యి ఎకరాలు అమ్మేసి.. వెయ్యి కోట్లు సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు కాబోలు. కానీ.. ఇవే వెయ్యి ఎకరాలు రేపు ప్రజల నుంచి సేకరించాలంటే.. పది వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు పునరావాసం కల్పించడం అనేది పెద్ద సవాల్. వారి ఉపాధిపైనా పెను ప్రభావం పడుతుంది. ఇలాంటి ఎన్నో సవాళ్లు ఉంటాయి.
అటు ఏపీ సర్కారు కూడా ఇదే పని చేస్తోంది. లోటులో ఉన్న ఖజానాను పూడ్చుకునేందుకు పట్టణాలు, నగరాల్లోని విలువైన భూములను అమ్మడానికి సిద్ధమైంది. కోర్టు దీనిపై స్టే విధించింది. అయితే.. ఇలా భూములు అమ్మేసుకొని, రేపు అవసరమైనప్పుడు ఏం చేస్తారు? ఇటీవల ఏపీ సర్కారు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూములు సేకరిస్తే.. దాదాపు 16 వేల కోట్ల రూపాయలు ఖర్చైంది. ఇలా.. భవిష్యత్ లో ఎన్నో అవసరాలు వస్తాయి. కాబట్టి.. ప్రభుత్వాలు.. ఈ పూటకు కడుపునిండితే చాలన్న పద్ధతిలో కాకుండా.. రేపటి రోజును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.