
గత రెండు సంవత్సరాలుగా కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఇప్పటి రెండు సార్లు కరోనా విజృంభించి అనేక మంది ప్రాణాలను బలిగొంది. అయితే ఫస్ట్ వేవ్ కేసులు కాస్త తగ్గుముఖం పడడంతో కరోనా ఇక తొలిగిపోయిందని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారి కేసులు పెరగడంతో ప్రభుత్వాలు కూడా షాక్ తిన్నాయి. కరోనా సోకిన వారికి సరైన సౌకర్యాలు లేకే చాలా మంది చనిపోయారని కొందరు వైద్య నిపుణులు పేర్కొన్నారు. అయితే మరోసారి ఇలాంటి నిర్లక్ష్యం చేయొద్దనే ఉద్దేశంలో ప్రభుత్వాలు ముందుగానే జాగ్రత్తపడుతున్నాయి.
త్వరలో థర్డ్ వేవ్ ఉంటుందని, ఇది పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ముందుగానే సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 19 ఆర్టీపీఎస్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా చిన్నపిల్లలకు సంబంధించిన ఐసీయూలు, ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.
ఇదిలా ఉండగా ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ మొదలైతే పిల్లలకు చికిత్స చేసే డాక్టర్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై కూడా నివేదికలు తెప్పించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 598 మంది చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉన్నట్లు వైద్యులు నివేదికలందించారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే పీడియాట్రిక్స్ వైద్యులతో పాటు ప్రస్తుతం మెడికల్ కళాశాలల్లో చదువుతున్న వారి డేటాను కూడా సేకరిస్తున్నారు. వారి సేవల్ని కూడా ఇందులో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
ఇదిలా ఉండగా కొందరు థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని ఎక్కడా ఆధారాలు లేవని అంటున్నారు. అలాంటి భయాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ చిన్న పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినా అందుకు సంబంధించిన డాక్టర్లు సంప్రదించాలని సూచిస్తున్నారు.