సీఐడీపై యుద్ధానికి టీడీపీ సిద్ధం..?

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ఫేక్ కేసులు పెట్టిందని ఆ పార్టీనేతలు రోజుకో ఆధారంతో తెరపైకి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఎస్సీలు నష్టపోయారని.. వారంతా తనకు ఫిర్యాదు చేశారని అందుకే తాను సీఐడీకి ఫిర్యాదు చేసినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారు కాదని రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు కొందరు ప్రకటించారు. సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని అందులో ఉన్న […]

Written By: Srinivas, Updated On : March 26, 2021 11:31 am
Follow us on


టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ఫేక్ కేసులు పెట్టిందని ఆ పార్టీనేతలు రోజుకో ఆధారంతో తెరపైకి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఎస్సీలు నష్టపోయారని.. వారంతా తనకు ఫిర్యాదు చేశారని అందుకే తాను సీఐడీకి ఫిర్యాదు చేసినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారు కాదని రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు కొందరు ప్రకటించారు.

సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని అందులో ఉన్న వివరాలు అన్నింటిని పరిశీలిస్తున్న టీడీపీ… వీడియో సాక్ష్యాలను కూడా రెడీ చేసుకుంటోంది. వీటన్నింటిని ప్రణాళిక ప్రకారం.. ప్రజల ముందు ఉంచుతోంది. తాము రాజధాని భూములను బలవంతంగా తీసుకోవడం వల్ల.. లేక ఇతర కారణాల వల్ల నష్టపోయామని పేర్కొంటున్న ఐదారుగురు రైతుల వివరాలు సైతం టీడీపీ సేకరించింది. అందులో రెండు కుటుంబాలు అసలు ఎస్సీ సామాజికవర్గానికి చెందినవి కాదని.. టీడీపీ నేతలు చెబుతున్నారు.

మూడు కుటుంబాలు.. తాము అసలు ఫిర్యాదు చేయలేదని.. తమ భూమి అమ్ముకున్నామో లేదో వివరాలు తెలుసుకోవడానికి వచ్చి సంతకాలు పెట్టించుకున్నారని.. రాజకీయాలకు తమకు సంబంధం లేదని అంటున్నారు. తాడేపల్లి పోలీసు స్టేషన్లోనూ అదే విషయం చెప్పామని అంటున్నారు. ఈ వీడియోలను టీడీపీ విడుదల చేసింది. ఇప్పుడు మొత్తంగా.. చంద్రబాబు నాయుడు టార్గెట్ గా సీఐడీ అధికారులు.. ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి కుట్ర పన్నారని.. స్పష్టమైన ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. వీటిని ఇలా ప్రజల ముందుకు కాకుండా.. సీఐడీపై ఎదురు కేసులు వేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

ఈ విషయాన్ని గురించి ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ కుట్రలను పోలీసు అధికారులు అమలు చేస్తున్న వైనం.. పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఓ ప్రభుత్వ సలహాదారుడు.. రాజకీయం కోసం వాడుకుంటున్న వైనం బయటకు రావాలంటే.. సీఐడీని కోర్టుకు లాగాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుతో ఉన్నారు. మొత్తం వైసీపీ నేతలు చంద్రబాబును ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. కేసు మొత్తం రివర్స్ వెళ్తోందని అనుకుంటున్నారు.