టిడిపి నేతలు కరోనా సమయంలోనూ రాజకీయాలను విడిచిపెట్టడం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ అర్ధంలేని ఆరోపణలతో గవర్నర్ కు టీడీపీ నాయకులు లేఖ రాశారన్నారు. ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్, రూ. వెయ్యి సాయం అందిస్తోందని, పంపిణీని ఎమ్మెల్యేలు పర్యవేక్షించడాన్ని రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. వాలంటర్లు చేసే వెయ్యి రూపాయల పంపిణీని ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తే తప్పు ఎలా అవుతుందన్నారు. రాజకీయ విమర్శలు చేసే సమయం ఇది కాదని హితవు పలికారు. పేదలకు ప్రభుత్వం అందించే సాయం సక్రమంగా అందుతుందా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే కాదు, సాధారణ కార్యకర్తలది కూడా ఉందన్నారు.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు సాయం అందిస్తూ మాకే ఓటు వేయమని ఎవరైనా ప్రచారం చేస్తారా…ఇది ధర్మమా… ఎక్కడైనా ఇలా జరిగితే ఆధారాలతో నిరూపించాలని కోరారు. టిడిపి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను రాయించి, వాటిని చూపి విమర్శలు చేస్తున్నారని, ఇటువంటి విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రజలకు అండగా వుండాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎక్కడ వున్నాడని ప్రశ్నించారు. ఆయనకు ఒక్కడికే కుటుంబం వుందా? మాకు మాత్రం కుటుంబాలు, బంధువులు లేరా? మేం అన్ని ప్రాంతాలకు తిరుగుతూ ప్రజలకు అండగా వుంటున్నాం. కానీ చంద్రబాబు హైదరాబాద్ లో వుంటూ… బాధ్యతారహితంగా విమర్శలు చేయడం సరికాదన్నారు.
చంద్రబాబు అంటే వృద్ధుడు అని అనుకోవచ్చని, ఆయన కుమారుడు లోకేష్ యువకుడు కాదా, ఆయన ఎందుకు బయటకు రావడం లేదు, ప్రజలకు అండగా నిలవడం లేదనే విషయాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో రూ. 500 నేరుగా వేస్తోందని, రేషన్ కేవలం 90 లక్షల మందికే ఇస్తున్నారు. మిగిలిన యాబై లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఇస్తోందని ఇది తెలియక బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పారు.
కేంద్రం ప్రకటించకముందే బియ్యంకార్డు దారులకు వెయ్యి రూపాయల సాయంను సీఎం జగన్ గారు ప్రకటించినట్లు తెలిపారు.
కరోనా నుంచి ప్రజలను రక్షించుకోవాలనే దానిపైనే మేం దృష్టి సారిస్తున్నామని, సీఎంగారు ఇచ్చిన లాక్ డౌన్ పిలుపును ప్రజలు సానుకూలంగా తీసుకుని విజయవంతం చేయాలని కోరుతున్నానట్లు చెప్పారు. ఢిల్లీ మార్కజ్ నుంచి మొత్తం 1,085 మంది వచ్చారని, వారికి అన్ని పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వారితో వున్న వారికి కూడా పరీక్షలు చేస్తున్నామని, రాష్ట్రంలో 30 వేల పడకలను సిద్దం చేసినట్లు, ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను కూడా అందుకు అనుగుణంగా సిద్దంగా చేశామన్నారు.
మీడియా కూడా పాజిటీవ్ గా వ్యవహరించాలని కోరుతున్నామని, కరోనా నియంత్రణ, ప్రజలకు సాయం చేసే కార్యక్రమాలకు వక్రభాష్యం చెప్పవద్దని కోరారు. ప్రభుత్వ చర్యల్లో ఎక్కడైనా లోపం వుంటే… వాటిని మా దృష్టికి తీసుకురండి, వెంటనే స్పందిస్తామని చెప్పారు. వందేళ్ల తరువాత ఇటువంటి సంక్షోభం వచ్చింది. దీనిని కట్టడి చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సీఎం జగన్ చేతులు జోడించి మరీ ప్రజలకు విజ్ఞప్తి చేశారని, ప్రజలు భౌతిక దూరంను పాటించడం ద్వారా కరోనాను అడ్డుకోవాలన్నారు.